దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగించాయి. గత నెలరోజుల ప్రస్థానాన్ని గమనిస్తే, తాజా వారంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. వారం ప్రాతిపదికన చూస్తే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 2.6 శాతం , నిఫ్టీ 2.4 శాతం చొప్పున నష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్ నిఫ్టీ గత వారంలో ఆర్జించిన లాభాలను చేజార్చుకుంటూ 2.4 శాతం మేర క్షీణించింది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనలకు తోడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తమయ్యారు. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారం తొలిరోజున భారీ నష్టాలను మిగిల్చాయి. తొలి సెషన్‌లో ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 540 పాయింట్ల నష్టంతో 40,145 వద్దకు చేరగా నిఫ్టీ 162 పాయింట్ల మేర క్షీణించి 11,767 వద్ద స్థిరపడింది. అక్టోబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత వాతావరణం కొనసాగింది.
ఇక మూడో, నాలుగు సెషన్లలోనూ దేశీ మార్కెట్లు నష్టాలను మిగిల్చాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన మార్కెట్లలో మిడ్‌సెషన్ కల్లా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎఫ్ అండ్ వో గడువు ముగింపుతో పాటు ఏషియా మార్కెట్ల బలహీన ధోరణి వెరసి దేశీ సూచీలపై ప్రతికూల ప్రభావం పడినట్లయింది. వారాంతపు సెషన్‌లోనూ దేశీ మార్కెట్లు నష్టాల బాటన సాగాయి. ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో సెన్సెక్స్ 135 పాయింట్ల మేర క్షీణించి నిఫ్టీ 28 పాయింట్ల మేర నష్టంతో 11,642 వద్ద ముగిశాయి.
ప్రపంచ దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనలకు తోడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు కుదేలవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను దేశీ మార్కెట్లు అందిపుచ్చుకుంటున్న కారణంగా సూచీలు నష్టాల బాటన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేవారం సైతం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.