Jio Charges: ఇకపై జియో నుంచి ఇతర నెట్వర్క్ కి కాల్ చేస్తే చార్జీలు పడతాయి!
జియో నుంచి ఇతర నెట్వర్క్ కి కాల్ చేస్తే ఇకపై చార్జీలు పడనున్నాయి. ఈమేరకు జియో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (అక్టోబర్ 10) జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ నంబర్లకు ఫోన్ చేస్తే ప్రతి నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా తగిన డేటాను తిరిగి అందిస్తామని చెబుతూ జియో ఓ ప్రకటన చేసింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీ (ఐయూసీ)ల విషయంలో టెలికాం రెగ్యులేటరి అథారిటీ (ట్రాయ్) నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
జియో సొంత నెట్ వర్క్ కాల్స్ కు మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే, ఇన్ కమింగ్ కాల్స్, ల్యాండ్ లైన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ కు ఈ ఛార్జీలు వర్తించవని వివరించింది.
ఈ సందర్భంగా ఐయూసీ టాప్ అప్ వోచర్లను జియో ప్రవేశపెట్టింది. దీని వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని తెలిపింది. ట్రాయ్ జీరో టర్మినేషన్ చార్జిని తొలగించే వరకూ ఈ టాప్ అప్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 వరకూ అమల్లో ఉండనుంది.
టాప్ అప్ ఓచర్ లు ఇలా..
- 10 రూపాయల ఓచర్ తొ 124 నిమిషాలు ఇతర నెట్వర్క్ కు కాల్స్ 1 జీబీ డాటా
- 20 రూపాయల ఓచర్ తొ 249 నిమిషాలు ఇతర నెట్వర్క్ కు కాల్స్ 2 జీబీ డాటా
- 50 రూపాయల ఓచర్ తొ 656 నిమిషాలు ఇతర నెట్వర్క్ కు కాల్స్ 5 జీబీ డాటా
- 100 రూపాయల ఓచర్ తొ 1362 నిమిషాలు ఇతర నెట్వర్క్ కు కాల్స్ 10 జీబీ డాటా