Girls Benefits Schemes: ఆడపిల్లల కోసం ఉత్తమ ప్రభుత్వ పథకాలు.. ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోండి..!
Girls Benefits Schemes: ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి.
Girls Benefits Schemes: ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. సమాజంలో లింగ వివక్షతను రూపు మాపడానికి, భ్రూణ హత్యలను ఆపడానికి, ఆడపిల్లల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వాలు అనేక స్కీంలను అమలు చేస్తున్నాయి. ఆడపిల్లల తండ్రులు ఏ విధంగాను నిరుత్సాహ పడకుండా వారికి భరోసా కల్పిస్తున్నాయి. అలాంటి కొన్ని పథకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల పేరుపై అకౌంట్‌ను ఓపెన్ చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఇందులో ఏడాదికి రూ.250 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తెకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ ఖాతా కొనసాగుతుంది. ఆమెకు 18 ఏళ్లు నిండితే ఉన్నత విద్య కోసం 50 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం 8 శాతం వార్షిక వడ్డీని ఇస్తుంది. అంతేకాకుండా మీరు ఆదాయపు పన్నులో మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు.
బాలికల సమృద్ధి యోజన
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం బాలికా సమృద్ధి యోజనను ప్రారంభించారు. ఇందులో కూతురు పుడితే రూ.500 ఇస్తారు. దీనితో పాటు మార్తె పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు మెకు వార్షిక స్కాలర్‌షిప్ ఇస్తారు. ఈ మొత్తం రూ. 300 నుంచి మొదలై ఏటా రూ. 1000కి చేరుకుంటుంది.
ఉడాన్ CBSE స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఉడాన్ (UDAAN) ప్రాజెక్ట్‌ను CBSE బోర్డుతో పాటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ఇంజినీరింగ్ కాలేజ్‌ల్లో బాలికల నమోదును పెంచడానికి ఈ స్కీంను తీసుకొచ్చారు. దీని కింద 11వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి ఉచితంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. రూ. 6 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాల కుమార్తెలకు 3 శాతం సీటు కోటా లభిస్తుంది. ఈ ఫారమ్‌ను CBSE వెబ్‌సైట్ నుంచి నింపాల్సి ఉంటుంది.
జాతీయ ప్రోత్సాహక పథకం
AC/ST కేటగిరీ బాలికలలో మాధ్యమిక విద్యను ప్రోత్సహించడానికి, డ్రాప్ అవుట్‌లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 8వ తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతిలో ప్రవేశం పొందిన బాలికలకు రూ.3000 ఎఫ్‌డీ చేస్తారు. ఆమె 18 ఏళ్లు నిండి 10వ తరగతి దాటిన తర్వాత దాన్ని వడ్డీతో విత్ డ్రా చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిలో ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వీటిలో ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య వరకు అందుబాటులో ఉండే అనేక పథకాలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన లాడ్లీ పథకం, బీహార్‌లోని ముఖ్యమంత్రి కన్యా సురక్ష యోజన, పశ్చిమ బెంగాల్‌లోని కన్యశ్రీ ఇలాంటి పథకాలే.