బ్యాంకులకు వరుసగా మూడురోజులు సెలవులు రాబోతున్నాయి. పండగలు లేకుండా సెలవులు ఏమిటని అనుకోవద్దు. రేపట్నుంచి అంటే 31 జనవరి నుంచి రెండు రోజుల పాటు బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మె చెయబోతున్నాయి. ఇక 2 వ తేదీ ఆదివారం. అందుకే మూడురోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
సమ్మె ఎందుకు?
బ్యాంక్ యూనియన్లు 20 శాతం హైక్‌తో వేతన సవరణ కోరుతున్నాయి. ఈ డిమాండ్ 2017 నవంబర్ నుంచి పెండింగులో ఉంది. తమ డిమాండ్లపై సానుకూల ప్రకటన రాకుంటే సమ్మెకే వెళ్ళాలని యూనియన్లు నిర్ణయించాయి. ఈ నేపధ్యంలో వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండుతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇతర PSU బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె గురించి తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ, కొన్ని బ్యాంకు యూనియన్ల సమ్మె కారణంగా బ్యాంకు కార్యకలాపాలు ప్రభావితమవుతాయని తమ కస్టమర్లకు తెలియజేశాయి.
వేతన సవరణకు డిమాండ్.. తక్షణ వేతన సవరణను డిమాండ్ చేస్తూ తొమ్మిది బ్యాంకు యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వివిధ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్ (NOBW) వంటి యూనియన్లు ఉన్నాయి.
పరిష్కారం కనిపించనందునే..
సమస్య పరిష్కార కోసం చీఫ్ లేబర్ కమిషనర్ ఎదుట జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేదని తెలుస్తోంది. తమ డిమాండ్ల నుంచి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) నుంచి కూడా ఎలాంటి హామీ రాలేదని యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు. వేతన సవరణపై IBA స్పందించడం లేదని, దీంతో తమకు సమ్మె మినహా మరో ఆప్షన్ లేకుండా పోయిందని, సమ్మె కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని, తమతో సహకరించాలని కస్టమర్లకు యూనియన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.