డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల భారీ ర్యాలీ
* మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మార్చ్‌కు భారీ స్పందన * మద్దతుదారులతో నిండిపోయిన వైట్‌హౌస్ పరిసరాలు.. * డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు * మిలియన్ మాగా మార్చ్ నిర్వహించిన మద్దతుదారులు * అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని మరోమారు ఆరోపించిన ట్రంప్
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైనప్పటికీ ఆయన మద్దతుదారుల జోరు ఏమాత్రం తగ్గలేదు. వాషింగ్టన్ డీసీలో ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మిలియన్ మాగా మార్చ్ నిర్వహించారు. ట్రంప్ 2020: కీప్ అమెరికా గ్రేట్, ట్రంప్ గొప్ప అధ్యక్షుడు, స్టాప్ ది స్టీల్ వంటి నినాదాలతో హోరెత్తించారు. ట్రంప్ మద్దతుదారులతో వైట్‌హౌస్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్ నిన్న కూడా మరోమారు అవే ఆరోపణలు చేశారు.
కాగ,అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాదించిన విషయం తెలిసిందే. ఫలితాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బైడెన్ సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించాయి అమెరికా ప్రధాన మీడియా సంస్థలు. ఇదిలావుంటే.. శుక్రవారం నాటికి అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కీలకమైన జార్జియా డెమొక్రాట్ల వశమవగా.. ఉత్తరకరోలినాలో ట్రంప్ గెలిచినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. తాజా ఫలితాలతో బైడెన్ ఖాతాలో 306 ఎలక్టోరల్ ఓట్లు చేరగా.. ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. అయితే అచ్చం 2016 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే రావడం గమనార్హం. కానీ, అప్పుడు ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించి అధ్యక్ష పీఠం అధిరోహించగా.. అప్పటి డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను 232 ఓట్లు వచ్చాయి.