పంచాయతీ రెండో విడతలోనూ వైఎస్సార్‌సీపీ అభిమానుల హవా
* దాదాపు 80.4 శాతం స్థానాలు కైవసం * ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు 'పల్లె' బ్రహ్మరథం * ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు
చెదురుమదురు ఘటనలు మినహా ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా వైసీపీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేసింది. భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగింది. దాదాపు 80.4 శాతం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు విజయం సాధించారు.
రెండో విడతలో 3వేల 328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయనందున అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2వేల 786 సర్పంచ్ స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ జరిగింది. వైసీపీ మద్దతుదారులు విజయపథాన దూసుకెళుతున్న సరళి స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
రెండో విడత ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.61 శాతం ఓటర్లు ఓటు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావం ఉంటుందని భావించిన దాదాపు 200 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరిగింది.
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక గ్రామాల్లో ఉదయమే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరగగా.. ఆఖరి గంట 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు కేవలం ఐదు శాతం ఓట్లు నమోదు కావడం గమనార్హం.