YSRCP Attack on Raghu Rama krishna Raju: హస్తినలో రఘురామ రాజును జీరో చెసే పనిలో వైసీపీ!
YSRCP attack on MP Raghu Rama Krishna Raju : రాజుగారు తలచినది ఒకటి జరుగుతున్నది మరోటా...? ఢిల్లీ అంతా మనదేనుకున్న రఘురామకు, ఇప్పుడెందుకో ఎడమ కన్ను అదురుతోందా? అందుకే హైకోర్టును ఆశ్రయించారా? భయమేంటో తెలియని బ్లడ్డన్నట్టుగా మాట్లాడిన రాజులో, ఈ అలజడి ఎందుకు? వేటు తప్పదని లేటుగా గ్రహించారా? రాజుగారు మైండ్ గేమ్ ఆడితే, వైసీపీ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా? సడెన్‌గా హస్తినలో రాజుగారికి అంతా రివర్స్ అవుతున్నట్టు ఎందుకు అనిపిస్తోంది? వైసీపీ-బీజేపీ మ్యాథమ్యాటిక్స్‌లో, కనిపించని కెమిస్ట్రీ రాజుగారికి షాకిస్తోందా?
ఒకవైపు కరోనాతో అల్లాడిపోతున్న దేశ రాజధాని, ఇప్పుడు తెలుగు రాజకీయాల మంటలతో మండిపోతోంది. కొన్నిరోజుల నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, సొంత పార్టీపై అప్రకటిత యుద్ధాన్ని కొనసాగిస్తుండటం, అవన్నీ సైలెంట్‌గా గమనిస్తూ వైసీపీ అధిష్టానం రగిలిపోతుండటం, ఎలాంటి కాక రేపుతోందో చూస్తున్నాం. స్వపక్షంలో విపక్షంలా ఘాటైన విమర్శలతో రెచ్చగొడుతున్న రాజు వ్యవహారాన్ని, సీరియస్‌గా తీసుకుంది వైసీపీ హైకమాండ్. ఎలాగైనా ఆయనపై అనర్హత వేటు పడాలన్న పట్టుదలతో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ల్యాండయ్యారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లాను కలిసి, రఘురామపై డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చారు. కొన్నిరోజుల నుంచి సొంత పార్టీపై ఆయన చేస్తున్న వ్యాఖ్యల పేపర్ కటింగ్స్‌ను, మీడియాలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను సమర్పించారు. సుమారు వంద పేజీల లేఖను స్పీకర్‌కు అందించారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించిన రఘురామను ఎంపీగా అనర్హుడని ప్రకటించాలని కోరారు.
స్పీకర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, తీవ్ర స్వరంతో రఘురామపై స్పందించారు. ఆయన ఏ ఉద్దేశంతో తల్లిలాంటి పార్టీని దూషిస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు విజయసాయి. రఘురామ రాజు నైతిక విలువలు కోల్పోయారన్న సాయి, ఏవో లాభాలు ఆశించే, ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్నారని అన్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించిన రాజుపై, అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్‌ను కోరామన్న విజయసాయి, డిస్‌క్వాలిఫికేషన్‌పై హామి కూడా ఇచ్చారని తెలిపారు. పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలిచ్చిందని,చివరికి పార్టీపైనే ఆయన విమర్శలు చేశారని అన్నారు లోక్‌సభ వైసీపీ నాయకుడు మిథున్‌రెడ్డి.
ఏం డౌట్ లేదు. రఘురామ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని డిసైడయినట్టు కనిపిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్. తన చతురంగ బలగాలను ఇందుకోసం ప్రయోగిస్తోంది. ఢిల్లీకి వైసీపీ నేతలు బయల్దేరిన టైంలోనే, రఘురామ రాజు హైకోర్టును ఆశ్రయించడం, మొత్తం ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్. మొన్నటి వరకు తాను పార్టీని పల్లెత్తు మాటా అనలేదు, తాను ఏ రూలూ అతిక్రమించలేదన్న రాజు, ఆల్ ఆఫ్ సడెన్‌గా షోకాజ్ నోటీస్‌పై హైకోర్టులో పిటిషన్ వేశారు. షోకాజ్ నోటీసులోని లోపాలపై ఈసీ నుంచి స్పష్టత వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. అనర్హతపై స్పీకర్ నిర్ణయమే కీలకమని మొదటి నుంచి రాజుగారు అంటున్నారు. స్పీకర్ తేల్చే వరకు, అటు వైసీపీ గానీ, ఇటు రాజుగానీ, కోర్టుకు వెళ్లాల్సిన పనేలేదన్నది నిపుణుల మాట. రాజుపై ఎప్పుడు వేటుపడుతుందో, అసలు పడుతుందో లేదో, అందుకు తగ్గ ఆధారాలు వైసీపీ సమర్పిస్తుందో లేదో చెప్పలేమని కూడా ఎక్స్‌పర్ట్ట్స్ అన్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తనను ఎవరూ ఏం చెయ్యలేరు, చేస్తేగీస్తే సస్పెన్షన్ చెయ్యాలీ గానీ, డిస్‌క్వాలిఫై చెయ్యలేరని మరింత ఘాటుగా పార్టీపై, పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేసిన రఘురామ, ఏమయ్యిందో ఏమో, కానీ హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళుతున్నారని తెలియగానే, తనపై చర్యలు తీసుకోకుండా ఆపాలని పిటిషన్‌లో కోరారు. ట్రెండ్ సెట్ చేస్తానన్న రఘురామ, బెండ్ అవుతున్నారా? వేటు తప్పదని లేటుగా గ్రహించారా? ఢిల్లీ నుంచి ఆయనకు అందిన సిగ్నల్నే, అందుక్కారణమా? రఘురామలో అలజడికి కారణమేంటి? వైసీపీ దీమాకు బీజేపీ ఇచ్చిన బూస్టింగ్ ఏంటి?