YSR Pension Kanuka: నేటి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.
YSR Pension Kanuka: కరోనా కోరలు చాచినా.. కర్ఫ్యూ అమల్లో ఉన్నా సరే వైఎస్సార్ పెన్షన్ మాత్రం అందించడానికి వలంటీర్ల వ్యవస్ధ రోడ్డెక్కింది. ఇంటింటికి వెళ్లడం రిస్క్ అయినా సరే... అదే పద్ధతిలో పెన్షన్ లబ్దిదారుల చేతికి అందించడానికి తరలి వెళ్లారు. ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ నేడు ప్రారంభమైంది.
దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం (జూన్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1497.62 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారు. సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు పని చేస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు.