ఏపీలో వైఎస్సార్ కానుక.. ఇకపై వృద్ధాప్య పెన్షన్ రూ. 3000
Jagan: దేశంలోనే తొలిరాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
Jagan: నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని.. ఇప్పుడు అమలు చేయనున్నారు. వృద్ధులకు ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అండగా నిలవడానికి పెన్షన్‌ను టెన్షన్ లేకుండా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై వృద్ధులకు పెంచిన పెన్షన్ 3 వేల రూపాయలను అందించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 8 రోజుల పాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 3న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. కాగా.. కొత్తగా అర్హులైన లక్షా 17 వేల 161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.
పెన్షన్ల మంజూరు కోసం దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేపట్టారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది. దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది.