YS Vijayamma Wrote a Book on YSR: అందుకే వైఎస్సార్‌పై పుస్తకాన్ని రాశాను: వైఎస్ విజయమ్మ
సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి.. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను స్మరించుకుంటూ బుధవారం నివాళులర్పించారు. ఇక వైఎస్సార్ జయంతి సందర్భంగా "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్ విజయమ్మ రచించారు. పుస్తకావిష్కరణ అనంతరం విజయమ్మ మాట్లాడుతూ... 33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించిన సమయంలో నేను ఆయనలో చూసిన మంచితనం, ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను. ఆయన గురించి రాయాలని నాకు అనిపించింది. ఆయనలో మూర్తీభవించిన మానవత్వం గురించి, ఆయన మాటకు ఇచ్చే విలువ గురించి రాయాలనిపించింది.
ఎంతో మంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చారు అని చెప్పారు. ఈ అంశాలన్నీ ఆయనలో చూశాను ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నా కొడుకు, కోడలు కూతురు, అల్లుడు ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో వైఎస్సార్ మాటలను గుర్తు తెచ్చుకుని వాటి స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి వారు కూడా వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తూ నేను ఈ పుస్తకం రాశాను అని విజయమ్మ తెలిపారు.