పార్టీ పెట్టలేదు, పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయలేదు.. అయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనులకు ఇబ్బందిగా మారిన పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఉద్యమానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఉద్యమానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు షర్మిల టీం.
రాజన్న రాజ్యం కోసం కొత్త రాజకీయ పార్టీకి పునాదులు వేసుకుంటున్న షర్మిల ఖమ్మంపై ప్రత్యేక నజర్ పెట్టింది. ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశం అనంతరం ఆదివాసీ, గిరిజనులతో ముచ్చటించనున్నారు. ఒకరకంగా తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యం అని చెప్పిన వైఎస్ షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు వైఎస్ అభిమానులు, నాయకులతో సమావేశం అవుతూ.. మరోవైపు ప్రజా సమస్యలపై దృష్టి సారించారు.
ఇటీవల రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఇటు ఆదివాసీ, గిరిజనులకు, అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పోడు భూములపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పోడు భూముల సమస్య అధికంగా ఉంది. రోజూ ఏదో చోట అటవీ అధికారులకు ఆదివాసీ, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. బాధితుల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ షర్మిల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
2005 సంవత్సరానికి ముందు నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలను అందజేయాలని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. అర్హులైన పోడు సాగుదారులకు పట్టాలిచ్చారు. 2008 నుంచి ఇప్పటి వరకు 49,305 మంది గిరిజన రైతులు, 2లక్షల 3, 311 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 22,530 మందికి 81,161ఎకరాలను పంపిణీ చేశారు. 1లక్షా 4,951 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్న 21,952 మంది విన్నపాలను తిరస్కరించింది ప్రభుత్వం. 17,198 ఎకరాలకు సంబంధించిన 4,815 మంది రైతుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచింది.
పోడు భూముల సమస్య పై ఈనెల 21న హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు భారీ కాన్వాయ్‌తో షర్మిల వెళ్లనున్నారు..అనంతరం గిరిజనులతో సమావేశం కానున్నారు ఇక తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు ముందే ఆదివాసీ, గిరిజనులతో కలిసి పోడు భూముల పరిరక్షణ కోసం ఉద్యమించడానికి సిద్దమయ్యారు షర్మిల. దింతో 21 వ తేదీ షర్మిల ఖమ్మం యాత్ర ఆసక్తికరంగా మారింది.