వైఎస్ జగన్, చంద్రబాబు: కౌంటర్, ఎన్ కౌంటర్
YS Jagan vs Chandrababu Naidu: జగన్ తిరుమల టూర్ చివరి నిమిషంలో రద్దైంది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమని జగన్ ఆరోపించారు. డిక్లరేషన్ సమర్పించాల్సి వస్తోందనే జగన్ తిరుమలకు వెళ్లలేదని చంద్రబాబు కౌంటరిచ్చారు.
జగన్ తిరుమల టూర్ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. రెండు రోజుల తిరుమల టూర్ ను వైఎస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.అయితే ఈ టూర్ రద్దు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఏపీ సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తోందనే కారణంగానే జగన్ తిరుమలకు వెళ్లలేదని చంద్రబాబు కౌంటరిచ్చారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
దేవుడి వద్దకు వెళ్తామంటే అడ్డుకోవడం బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని ఆయన విమర్శించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారని... కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నాయకులు తిరుపతికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు.
తిరుమలకు వెళ్లొద్దన్న నోటీసులు చూపాలి: జగన్ కు చంద్రబాబు సవాల్
తిరుమలకు వెళ్లవద్దని జగన్ ను ఎవరు ఆపరని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు నోటీసులు ఇచ్చినట్టుగా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన చెప్పారు. తిరుమలకు వెళ్లొద్దని జగన్ కు ఇచ్చినట్టుగా చెబుతున్న నోటీసులను చూపాలని ఆయన కోరారు. హిందూ సంఘాల డిమాండ్ తో తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ పెట్టామన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు మాత్రమే అనుమతి లేదన్నారు.డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తోందనే కారణంతోనే ఆయన తిరుమలకు వెళ్లలేదని జగన్ పై సీఎం విమర్శలు చేశారు.
లడ్డూ వివాదంలో దొరికిపోయిన చంద్రబాబు: జగన్
వంద రోజుల పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. దీని నుంచి వారి అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకు తిరుపతి లడ్డూ కు ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని చంద్రబాబు తెరమీదికి తెచ్చారని జగన్ ఆరోపించారు. ఈ అంశం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ దొరికిపోవడంతో డిక్లరేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని చంద్రబాబు తీరుపై జగన్ మండిపడ్డారు. జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయంలో కూడా నాసిరకంగా ఉన్న నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీటీడీ అధికారుల వద్ద ఉండాల్సిన ఈ రిపోర్ట్ టీడీపీ కార్యాలయానికి ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు.
లడ్డూ వివాదంలో జగన్ అబద్దాలు: చంద్రబాబు
తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని జగన్ పదేపదే అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలు భాగోలేవని ఫిర్యాదులు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ రిపోర్ట్ దాచిపెడితే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడని ఆయన చెప్పారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎన్ డీ బీబీ రిపోర్ట్ బయటపెట్టిందని ఆయన తెలిపారు.
నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా: జగన్
నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా.. బయటకు వెళ్లినప్పుడు ఇతర మతాలను గౌరవిస్తానని జగన్ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే తాను పాదయాత్ర ప్రారంభించానని... యాత్ర ముగించిన తర్వాత కూడా స్వామిని దర్శించుకొన్నాకే ఇంటికి వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. నా మతం, కులం గురించి అడుగుతున్నారు.. నా మతం మానవత్వమని జగన్ తెలిపారు. ఇదే విషయాన్ని డిక్లరేషన్ లో రాసుకోవాలని ఆయన కోరారు.తన తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పట్టువస్త్రాలు సమర్పించారని.. తాను సీఎం కాకముందు పలుసార్లు తిరుమలకు వచ్చానని చెప్పారు.
అన్ని మతాలను గౌరవించాలి: చంద్రబాబు
తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీన్ని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు చెప్పారు. గతంలో టీటీడీ ఆలయ నిబంధనలను ఉల్లంఘించి జగన్ శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన విమర్శించారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలుంటాయి.... దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలు, సంప్రదాయాలను పాటించాల్సిందేనని చెప్పారు.
నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని జగన్ చెప్పారు. నాలుగు గోడల మధ్యే కాదు బయట కూడా చదువుకోవచ్చన్నవారు. ఇతర మతాలను గౌరవిస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ఆయా మతాల ఆచారాల మేరకు నడుచుకోవడమే ఆ మతాలను గౌరవించడమని చంద్రబాబు చెప్పారు. కానీ, అందుకు విరుద్దంగా వ్యవహరించడం ఆ మతాలను గౌరవించడం ఎలా అవుతుందని ఆయన జగన్ ను ప్రశ్నించారు.
లడ్డూ వివాదం నుంచి డిక్లరేషన్ వరకు తిరుపతి కేంద్రంగా ఏపీలో రాజకీయం సాగుతోంది. అధికార టీడీపీ, విపక్ష వైఎస్ఆర్ సీపీలు తమ వాదనలను సమర్దించుకుంటున్నాయి.