AP Elections Results: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా

AP Elections Results: చంద్రబాబు నియోజకవర్గంలో ఫ్యాన్‌ పాగా

Update: 2021-09-20 01:32 GMT
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘానా విజయం (ఫైల్ ఇమేజ్)

AP Elections Results: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుకు సొంత గడ్డమీద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాలకు పైగా మకుటాయమానంగా వెలిగిన ఆయన ప్రభావాన్ని.. వైసీపీ మసకబార్చింది. టీడీపీ జెండా ఎగరాల్సిన చోట.. ఎట్టకేలకు వైసీపీ జెండా నిలబడింది. ఒకటి కాదు, రెండు కాదు.. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైసీపీ హవా కొనసాగింది. ఎప్పుడూ వేరే పార్టీ ఆలోచన కూడా చేయని ఓటర్ల మదిలోకి వైసీపీ దూసుకెళ్లింది.

గుడుపల్లి మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా కృష్ణమూర్తి 11వేల 928 ఓట్ల అధిక మెజార్టీతో గెలుపొందారు. రామకుప్పం మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నితిన్ రాఘవరెడ్డి 15వేల 567 భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే.. శాంతిపురం మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ 16వేల 668 ఓట్ల అధిక మెజార్టీతో గెలుపొందారు. కుప్పం మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి A.D.S శరవణ 17వేల 383 మెజార్టీతో విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు.. 12 స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోగా.. ఒక స్థానంలో ఎలక్షన్ జరగలేదు.

రామకుప్పం మండలంలో 16కు 16 స్థానాల్లో వైసీపీ గెలుపు జెండా ఎగరవేసింది. కుప్పం మండలంలో 21 స్థానాల్లో 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగిలిన 18 స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ఒక స్థానంలో ఎలక్షన్‌ జరగలేదు. అలాగే.. శాంతిపురం మండలంలో 18 స్థానాలకు గాను 17 స్థానాలు వైసీపీ సొంతం చేసుకోగా ఒక్క స్థానంలో టీడీపీ విజయం సాధించింది.

కుప్పం నియోజకవర్గంలో 68 స్థానాలకు గాను 66 స్థానాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే 63 స్థానాల్లో వైసీపీ గెలవగా.. కేవలం 3 స్థానాలను మాత్రమే టీడీపీ కైవసం చేసుకోగలిగింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ గెలుపు.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది.

Tags:    

Similar News