AP Election Results: అనంతపురం జిల్లాలో వైసీపీ విజయ ఢంకా
AP Election Results: 60 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం
AP Election Results: అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి, రెండు మినహా ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. ఇక.. జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ముందు నుంచి అనుకూలంగా వచ్చాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 63 జెడ్పీటీసీ స్థానాలు, 841 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 62 జేడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు గతంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 స్థానాల్లో వైసీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా.. మడకశిర నియోజకవర్గం అగలి మండలంలో టీడీపీ, మరోచోట స్వతంత్ర అభ్యర్థి జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందారు.
ఇక.. జిల్లాలో 713 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా.. 50 చోట్ల టీడీపీ, ఒక్కోచోట కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు 13 మంది గెలిచారు. మడకశిర మండలం గౌడనహళ్లిలో బ్యాలెట్ బాక్స్ కు చెదలు పట్టడడంతో అక్కడ లెక్కింపును అధికారులు కొద్దిసేపు ఆపేశారు. అనంతరం పోలైన ఓట్ల ఆధారంగా లెక్కించారు. ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పార్వతమ్మ తొలుత 15 ఓట్లతో గెలవగా వైసీపీ రీకౌంట్ కి డిమాండ్ చేయడంతో మరో మారు లెక్కించారు. రెండో సారి లెక్కింపులో 35 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడంతో ఫలితాలు ఏకపక్షంగా సాగాయి. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో.. ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. టీడీపీకి పట్టున్న గ్రామాల్లోనూ ఈసారి విజయం వైసీపీని వరించింది. ఇదిలా ఉంటే.. గతంలో సర్పంచి, మున్సిపల్ ఎన్నికల్లోలాగే.. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగించడంతో.. వైసీపీ క్యాడర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.