ఎమ్మెల్యే సీట్లు దక్కని వైసీపీ ముఖ్య నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. పాదయాత్రలో జగన్ వైసీపీ నాయకులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారా అని ఎదురు చూపులు చూస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతుండటంతో ఆశావహుల్లో అసహనం మొదలైంది.
వైసీపీలో మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. పార్టీని ముందుండి నడిపించి కష్టకాలంలో వెన్నంటి ఉన్న ముఖ్య నేతలందరికీ న్యాయం చేసే పనిలో ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలకే మళ్లీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో సీట్లు ఆశించి భంగపడిన నేతలు అసహనంతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవులు ఉన్నా మళ్లీ వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తే మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాను APIIC చైర్మన్‌గా , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తుడా చైర్మన్‌గా , జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా సీఎం జగన్ నియమించారు. ఇదే కోవలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాకాని గోవర్దన రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారికి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలున్నాయి. మంత్రి పదవులు దక్కని వారందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కొందరు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు.
పాదయాత్ర సమయంలో జగన్ చాలామందికి ప్రభుత్వం ఏర్పాటయితే సీట్లు ఇవ్వని వారందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తానని ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని హామీలిచ్చారు. ఆ మేరకు జగన్ పోస్టుల నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. తలశిల రఘురాం, వైవీ సుబ్బారెడ్డిలకు ముఖ్య పదవులు కట్టబెట్టారు. అనుకోని వారికి మంత్రి పదవులు ఇచ్చి ఆశ్చర్యపరిచిన జగన్ నామినేటెడ్ పదవులపై అదే పంధాలో ముందుకు సాగుతున్నారు.
నామినేటెడ్ పదవుల విషయంలో కొందరు నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా పదవులున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో మరింత అసహనం పెరిగినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ పునరాలోచించాలని నేతలు భావిస్తున్నారు.