Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పై విచారణ వాయిదా
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఎక్స్ లో తాను చేసిన పోస్టులపై చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్నారని.. ఈ పోస్టులపై కేసులు నమోదు చేయవద్దని ఆదేశించాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు.
ఇప్పటివరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని కూడా ఆయన కోరారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మరో మూడు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ పోలీస్ స్టేషన్లతో పాటు మరో ఆరు కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు పోలీస్ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. అయితే తాను భయపడడం లేదంటూ నవంబర్ 27న ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
అసలు వివాదం ఏంటి
ఈ ఏడాది మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ, జనసేన కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ అయితే ఏడాది క్రితం తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి సంబంధం లేని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేశారని... దీనిపై కేసులు నమోదైన విషయాన్ని వర్మ చెబుతున్నారు.