Mayor: ఏపీ మున్సిపోల్స్‌లో వైసీపీ హవా
Mayor: 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు వైసీపీ కైవసం * ఈనెల 18న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక
Mayor: ఏపీలో మున్సిపోల్స్ ముగిశాయి. అధికార ప్రభుత్వం భారీ మెజార్టీతో సీట్లు దక్కించుకుంది. రాష్ట్రం మొత్తం 11 కార్పొరేషన్లు 73 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు వైసీపీ కైవసం చేసుకుంది. చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ఏకచ్ఛత్రాధిపత్యమే. అయితే ఇప్పుడు అన్నిటిలోనూ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక కీలకం కానుంది. అదేవిధంగా ఈనెల 18న మేయర్లు, చైర్మన్లను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించారు.
మేయర్ పీఠం దక్కించుకోవడానికి కావలసిన బలం, బలగం వైసీపీకి పూర్తిగా ఉండటంతో మేయర్ ఎన్నిక నామమాత్రపుతంతుగానే పూర్తికానుంది. మేయర్ పీఠంపై ఆశావహులు చాలామంది ఉండటంతో విజయవాడ, మచిలీపట్నంలో అభ్యర్థిని ఖరారు చేయడం కత్తిమీద సాములా మారింది. అయితే ఈ హాట్‌సీట్లలో ఎవరిని కూర్చోబెట్టాల్లో అనేసి స్థానిక నేతలు బుర్రలు బద్దలుకొట్టుకోకుండా సింపుల్‌గా బాధ్యతను సీఎంకు అప్పజెప్పేశారు.ఇదిలా ఉండగా మేయర్ ఎన్నికలో కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులను కలిపి లెక్కిస్తారు. దీనిప్రకారం హాజరైన మొత్తం సభ‌్యుల్లో సగం కంటే ఎక్కువ మంది మద్దతు ఉన్నపార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంటుంది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులందరికీ మూడు రోజుల ముందే సమాచారమందిచగా ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
ఎక్స్ అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణస్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే సమావేశంలో మేయర్ అభ‌్యర్థిని ఒక సభ‌్యుడు ప్రతిపాదిస్తే మరోసభ్యుడు మద్దతు తెలుపాల్సి ఉంటుంది. ఇక కార్పొరేటర్‌గా ఎన్నికైనవారే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అర్హులు. ఇక ఎక్కవమంది సభ్యులు మద్దతు ఉన్నవారిని మేయర్, డిప్యూటీ మేయర్‌గా ప్రకటిస్తారు