అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిపై వైసీపీ ఫోకస్
YCP: ఇప్పటికే అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
YCP: నాడు గవర వర్సెస్ గవర..నేడు వెలమ వర్సెస్ వెలమ ఉండబోతోందా..? అనకాపల్లి పార్లమెంట్ స్థానం కేంద్రంగా పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఫ్యాన్ పార్టీ..ఈ ఒక్క స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. 2019 ఎన్నికల్లో గవర సామాజికవర్గానికి చెందిన సత్యవతి అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగగా... అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపింది టీడీపీ. తాజాగా NDA కూటమి నుంచి సీఎం రమేష్ బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. ఆయనకు పోటీగా బలమైన అభ్యర్థిని దింపేందుకు వైసీపీ స్కెచ్ వేస్తోంది.
ఈ క్రమంలోనే ఆర్థికబలం, సామాజిక బలం ఉన్న నేతల పేరును పరిశీలిస్తోంది. సీఎం రమేష్ వెలమ సామాజికవర్గానికి చెందిన లీడర్ కావడంతో.. ఆ సామాజికవర్గానికి చెందిన లీడర్‌నే బరిలోకి దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే..బూడి ముత్యాలనాయుడి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఈసారి అనకాపల్లి లోక్‌సభ దంగల్‌లో వెలమ వర్సెస్ వెలమ ఉండే అవకాశం ఉంది.