ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోని వైసీపీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది.
ఏపీ రాజకీయం తమిళనాడు రాజకీయాలను తలపిస్తోందా...? ఏపీ ప్రజలు విలక్షణ తీర్పు ఎందుకు ఇస్తున్నట్లు...? తమిళనాడు రాజకీయాలను ఏపీ ప్రజలు పుణికిపుచ్చుకున్నారా...? రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలను చూస్తే ఏం అర్థమవుతుంది...?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అధికార వైసీపీ గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా పరాజయం పాలైంది. కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి... కూటమి ఆధిక్యంలో దూసుకపోయింది. కూటమి విజయం సాధించినా.. వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని చాలా మంది విశ్వసించారు. కానీ... కనీస స్థాయిలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఎన్నికల ముందు వై నాట్ 175 అన్న వైసీపీ నేతలు... ప్రతిపక్ష హోదా సైతం దక్కకపోవడంతో ఖంగుతిన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల స్వభావం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు. అధికారానికి కావాల్సిన సీట్లను కట్టబెట్టి ప్రభుత్వంలోకి తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత 2019లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీని చెల్లాచెదురు చేశారు. ఆ దఫా వైసీపీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను అంటగట్టి వారికి అద్భుతమైన మెజారిటీని అప్పగించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు.
ఓటరుతో పెట్టుకుంటే ఎంతటి వారైనా ఒక్కటే. ఎవరినైనా ఓడించే సత్తా మాకు ఉందని అని ఓటర్లు మరోసారి నిరూపించారు. వై నాట్ 175, కుప్పంలో కూడా మనం గెలుస్తున్నాం.. అంటూ ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యే వరకు జగన్ చెప్పిన మాట ఇదే. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం, పిఠాపురంలో పవన్ కల్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడిస్తాం అంటూ జగన్‌తో పాటు మంత్రులు, వైసీపీ నాయకులు పదేపదే చెప్పారు. కానీ మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మినహా అందరూ ఓటమి చెందారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా... కనీసం ప్రతిపక్ష హోదాలో అయినా అసెంబ్లీలో ఉండాలని పార్టీలు భావిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. ఫలితాల ప్రారంభంలో వైసీపీకి కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయనే అంచనా వేసినా... చివర్లో ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా పోయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే... వైసీపీ కంటే జనసేన అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.