తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా..? లేదా..?
Tirupati Laddu Row: ఇవాళ, రేపు తిరుమలలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రేణిగుంట చేరుకుంటారు జగన్.
Tirupati Laddu Row: ఇవాళ, రేపు తిరుమలలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రేణిగుంట చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి తిరుమల బయల్దేరి వెళ్తారు. రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు. ఇక.. శనివారం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు గెస్ట్ హౌస్ నుంచి బయల్దేరి తిరుమల శ్రీవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. అయితే.. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి ఘటన.. ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ తిరుమల పర్యటన.. మరింత అగ్గిని రాజేస్తోంది.
ముఖ్యంగా జగన్ తిరుమల పర్యటన సందర్భంగా మరోమారు డిక్లరేషన్ వివాదం తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా స్వామివారి ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ వివాదం ముగియకముందే మాజీ సీఎం తిరుమల పర్యటన చర్చకు తెరలేపింది. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వాడారన్న విషయంపై రాజకీయంగానూ పెద్ద దుమారం రేగింది. ఈ సమయంలో రెండురోజుల జగన్ తిరుమల పర్యటన పాలిటిక్స్‌ను వేడెక్కిస్తోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో తయారయ్యే శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న విషయంపై యావత్ భారతావనిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. జగన్ తిరుమల పర్యటనపై ఇప్పటికే కూటమినేతల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తూన్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రను దెబ్బతీశారని.. నెయ్యి సహా స్వామివారి నైవేద్యానికి వాడే వస్తువులు నాసిరకమైనవి వాడారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. NDDB నివేదికతో నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. అటు.. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం.. తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారని వైసీపీ విమర్శిస్తోంది. ఈ వివాదం చల్లారకముందే వైసీపీ అధినేత జగన్.. రెండురోజుల తిరుమల పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేవదేవుడిని దర్శించుకోవాలంటే మాజీ సీఎం డిక్లరేషన్‌పై సంతకం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
తిరుమలలో అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే. హిందూ దేవాలయాలను ఇతర మతస్తులు దర్శించిన సమయంలో మత విశ్వాసాలు దెబ్బ తినకుండా ఏపీ ప్రభుత్వం 1990 లో గెజెట్ విడుదల చేసింది. జీఓ నంబర్ 311 గెజిట్ ప్రకారం హిందూ దేవాలయాలకు తరలివచ్చే ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆలయానికి వచ్చే అన్యమతస్థుల కోసం ఆయా దేవాలయాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన డిక్లరేషన్ ఫార్మ్ ఉంటుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో స్వామిని దర్శించుకునే వారికోసం డిక్లరేషన్ ఫార్మ్ అందుబాటులో ఉంటుంది.
అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, హైందవ మతాన్ని విశ్వసిస్తున్నట్లు ఉంటుంది. ఆలయ దర్శనానికి వచ్చిన వారు దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది. శ్రీవారి దర్శనంలో హిందూ సంప్రదాయం దుస్తులతో మాత్రమే ఆలయంలోకి అనుమతించాలన్న నిబంధన కూడా ఉంది. దాని ప్రకారం ప్రధానంగా విఐపీ బ్రేక్ దర్శనం కోసం వచ్చేవారు కుర్తా, పైజామా, ధోతి, షర్ట్ ధరించి రావాల్సి ఉంటుంది. మహిళలు పంజాబీ డ్రెస్, లంగా ఓనీ, చీర ధరించాల్సి ఉంటుంది. ఇతర మతాలకు సంబంధించిన దుస్తులు, గుర్తులను కొండపైకి అనుమతించరు.
టీటీడీలో ముందు నుంచి కొన్ని సాధారణ నిబంధనలు ఉన్నాయి. నియమం సంఖ్య 136 ప్రకారం.. హైందవులను మాత్రమే శ్రీవారి ఆలయానికి అనుతించాలని ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం చేసుకోవాలనే కోరిక ఉన్నవారు, హిందూమతంపై అమితమైన విశ్వాసం ఉన్న హైందవేతరులు తమ మతం గురించి టీటీడీ అధికారులకు ముందుగా తెలపాల్సి ఉంటుంది. టీటీడీ నియయం 137 ను అనుసరించి హిందూ మతంపై విశ్వాసం ఉన్నట్లు వారు ప్రకటించాలి. ఒక డిక్లరేషన్ ఫార్మ్ లో హిందూమతంపైవిశ్వాసం, నమ్మకం ఉన్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేసిన అనంతరం హిందూయేతరులను శ్రీవారి ఆలయంలోకి అనుతించాలనే నిబంధన ఉంది. 2014లో జారీ అయిన సర్క్యులర్ అనుగుణంగా తిరుమలలో ఎవరైనా హిందూయేతరులుగా గుర్తించబడితే వారి వద్ద నుంచి టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడగవచ్చు.
గతంలో దేశంలోని పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నప్పుడు టీటీడీ వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంది. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో తిరుమలలో ఆమె డిక్లరేషన్ ఇచ్చారట. మాజీ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం.. ఆ సమయంలో తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చి హైందవ సంస్కృతిని గౌరవిస్తున్నట్లు తెలిపారట. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్సార్ గతంలో డిక్లరేషన్ ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
హిందూయేతర రాజకీయ ప్రముఖులు తిరుమలను సందర్శించే సందర్భంలో చాలా మంది డిక్లరేషన్ ఫారంపై సంతకం చేశారట. అలాగే.. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే శ్రీవారి దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రముఖుల పర్యటనలో డిక్లరేషన్ ఇవ్వలేదన్న చర్చ ఉంది. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్.. శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఏనాడూ డిక్లరేషన్ సమర్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం కాకముందు ఇదే విధానం పాటించారట. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయట.
ఇప్పుడు తాజాగా.. మరోసారి మాజీ సీఎం జగన్.. తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి డిక్లరేషన్ వివాదం తెరకెక్కింది. కచ్చితంగా జగన్ డిక్లరేషణ్‌పై సతకం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్టన్ 30 పోలీస్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చారు. మరి.. అందరూ డిమాండ్ చేస్తున్నట్టు మాజీ సీఎం డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా..? లేక యథాలాపంగా అలాంటివేవీ పాటించకుండానే స్వామివారిని దర్శించుకుంటారా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.