విశాఖ అధికార పార్టీలో నామినేటేడ్ పదవుల కోసం సీనియర్లు వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తున్నారు. అధికారంలోకీ రావడానికి తామంతా అహర్నిశలు శ్రమించామని ఏడాదిన్నరగా అదిగో పదవి...ఇదిగో పదవి అంటూ తమని ఊరించటం తప్ప, ఒరిగిందేమి లేదంటున్నారు. ప్రస్తుతం సీనియర్లు-జూనియర్లు పదవో రామచంద్ర అంటూ పైరవీల్లో తలమునకలయ్యారట. ఎవరా నేతలు?
పదవీ పదవీ పదవీ....రాజకీయాల్లోకి వచ్చేదే అందుకు. ఏళ్లతరబడి కళ్లుకాయలు కాసేలా నిరీక్షించేది పోస్టుల కోసమే. కానీ ఇస్తామని ఆశపెట్టి, వచ్చినట్టే వచ్చి, ఊరించి ఊరించి ఎంతకూ పదవీ రాకపోతే, లీడర్ల పరిస్థితి ఏంటి? అదేదో సినిమాలో చెప్పినట్టు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కెళ్లి, పదవి పొందిన కొందరు లీడర్ల డామినేషన్ తాలుకా, సప్రెషన్‌లోంచి పుట్టుకొచ్చిన, డిప్రెషన్ క్రియేట్ చేసిన, కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్‌తో కొట్టుకోవాల్సిందే. ఇప్పుడు విశాఖ వైసీపీ తీరం కూడా, ఫ్రస్ట్రేటెడ్ లీడర్లతో రగిలిపోతోంది.
విశాఖ వైసీపీలో సుమారు 13 మంది మాజీ ఎమ్మెల్యేలు పదవుల కోసం, కళ్లకు ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. అడగలేక, మింగలేక సతమతమైపోతున్నారు. అంతా అధిష్టానం దయా అంటూ నిరీక్షిస్తున్నారట. విశాఖ జిల్లాలో ఈ తరహా నేతల జాబితా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పలువురు మాజీ మంత్రులు కూడా, ఈ లిస్టులో వున్నారట. పదవుల కోసం వెయిట్ చేస్తున్నవారిలో మొదటి వరుసలో వున్న నేత మల్లా విజయ ప్రసాద్. ఈయన కాంగ్రెస్ హయాంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ దక్కినప్పటికీ, పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన నగర అధ్యక్షులుగా ఉన్న సమయంలో, నగరం నదిబొడ్డున మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేల్లో ఎంతో కొంత చెప్పుకోదగ్గ ప్రాధాన్యత వున్న విజయప్రసాద్, తనకు నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్నారు.
ఇక దాడివీభద్రరావు. స్టేట్‌లోనే సీనియర్ మోస్ట్ అని చెప్పుకోదగ్గ నేత. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పని చేశారు. వైసీపీలోకి వచ్చి, ఆ తర్వాత బయటకు వెళ్లి, మళ్లీ వచ్చారు. జంపింగ్ జపాంగ్‌లతో అటూఇటూ తిరిగిన దాడికి, టైమ్ కలిసిరావడం లేదు. ఆయన కుమారునికి టైమింగ్ కుదరడం లేదు. కొడుక్కి 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా, గెలిపించుకోలేకపోయారు. ఎన్నికల తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి స్థాయిలో, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. కానీ అది లెటర్ హెడ్‌కు మాత్రమే పరిమితమైంది. తనకు లేదంటే తన కుమారుడికైనా చెప్పుకోదగ్గ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని దాడి చెయ్యని ప్రయత్నం లేదట.
ఇక గిరిజన ప్రాంతంలో చెప్పుకోదగ్గ మరో నాయకుడు కుంభా రవిబాబు. లాస్ట్ పోల్స్‌లో టికెట్ ఆశించినా దక్కలేదు. ఎప్పటికైనా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోతారా అని పడిగాపులే మిగిలాయి రవిబాబుకు. మన్యంలో మరో లీడర్ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పరిస్థితి, అంతకన్నా బెటరేమీ లేదు. కాంగ్రెస్ హయాంలో మినిస్టర్ చేసినా, జనసేన నుంచి ఫ్యాన్ చెంతకు చేరినా, బాలరాజుకు మాత్రం టైమ్ సెట్ కావడం లేదు. ఆయన కుమార్తెకు జడ్పీ చైర్మన్ పదవి ఇస్తారని ఆశించినా, ఫలించలేదు. మళ్లీ ఎన్నికల టైంలో, సమీకరణాలు మారితే అవకాశం రాకపోదా అని ఎదురుచూడ్డం తప్ప, మరో చాయిస్ లేదు బాలరాజుకు.
వీరే కాదు, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, వరలక్ష్మీ, ఎస్.ఎ. రెహమాన్‌తో పాటు మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీల పరిస్థితే ఇలా వుంటే, పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా, ఎన్నికల్లో టిక్కెట్ దక్కక, నామినేటేడ్ పదవులు ఆశిస్తున్న వారి జాబితా కూడా పెద్దగానే వుంది. ఒకవైపు సీనియర్‌లు, మరోవైపు జూనియర్‌లు ఈ పోస్ట్‌ల కోసం, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. పదవుల కోసం చెయ్యని ప్రయత్నం లేదు. కలవని నేతా లేడు. మరి అధినేత జగన్ ఎప్పుడు కరుణిస్తారో, ఎప్పుడు వీరి నిరీక్షణ ఫలిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.