సీఎంకు, సీఎస్‌కు ఎక్కడ చెడింది?

Update: 2019-11-05 05:12 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ సంచలనం కలిగించింది. అయితే ఇది ఆకస్మిక నిర్ణయం మాత్రం కాదనే చెప్పవచ్చు. కొన్ని రోజులుగా ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు చివరకు ప్రధాన కార్యదర్శి బదిలీకి దారి తీశాయి. ఈ అంశంలోకి మరింత లోతుగా వెళ్ళేందుకు ముందు అసలేం జరిగిందనే విషయం నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఎల్వీ సుబ్రమణ్యం తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌ నీరబ్ కుమార్‌కు అప్పగించి వెంటనే తన విధుల్లో చేరాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక ప్రధాన కార్యదర్శిని, అందులోనూ పదవీ విరమణ కు దగ్గర్లో ఉన్న అధికారిని ఈ విధంగా బదిలీ చేయడం బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి సంఘటన కావచ్చు. మరో ఐదు నెలల సర్వీస్ ఉన్నప్పటికీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మిక బదిలీ చేయడం అధికార వర్గాల్లో కలకలం సృష్టించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎలాంటి తీవ్ర ఆరోపణలు లేకుండానే ఆకస్మికంగా బదిలీ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. హోదాపరంగా తనకన్నా తక్కువ స్థాయి అధికారి అయినప్పటికీ సీఎంకు సన్నిహితుడైన అధికారిగా ప్రచారం లో ఉన్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి అయిన ప్రవీణ్ ప్రకాష్ కు మెమో జారీ చేసినందుకే ఎల్వీ సుబ్రహ్మణ్యంకు బదిలీ జరిగిందని కూడా చెబుతున్నారు. నిజానికి ఆ మెమో జారీ అనేది ఆయన బదిలీకి తక్షణ కారణం అయినప్పటికీ బహుశా ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. మొన్నటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అంటే సీఎం జగన్ సాఫ్ట్ కార్నర్ తోనే ఉండే వారు అనడంలో సందేహం లేదు. ఆ తరువాత మాత్రం పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని అంటారు. డంపింగ్ యార్డ్ స్థలాల ఎంపిక, ఇళ్ళ స్థలాల కేటాయింపు లాంటి అంశాల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై సీఎం జగన్ కు, ఎల్వీ సుబ్రహ్మణం మధ్య తేడాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. సహాయ కార్యదర్శి స్థాయి అధికారి బదిలీ విషయంలోనూ ఎల్వీ సుబ్రహ్మణ్యం కొంత పట్టుదలకు పోయారని అంటున్నారు. గ్రామ న్యాయాలయాల ఫైల్ కేబినెట్ ముందు పెట్టాలని సంబంధిత కార్యదర్శి సీఎం అనుమతి తీసుకున్నా ప్రవీణ్ ప్రకాశ్ ఆ ఫైల్ ను తనవద్దనే ఆపేశారు. అది నిబంధనలకు వ్యతిరేకమని ఎల్వీ సుబ్రహ్మణ్యం భావించారు. ఇలాంటి అంశాలపై తాజాగా ఆయన ప్రవీణ్ ప్రకాశ్ కు మెమో జారీ చేయడంతో మొత్తం వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. చివరకు అది ఎల్వీ సుబ్రహణ్యం బదిలీకి దారి తీసింది. సీఎస్‌ను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఉత్తర్వులు జారీ కావడం విశేషం.

అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏం మెమో జారీ చేశారు అందులో ఏముంది అనే విషయానికి వద్దాం. జగన్ ప్రభుత్వం గత కేబినెట్‌లో 'వైఎస్ఆర్ అవార్డు' పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్‌లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై ఎల్వీ సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాష్‌కు మెమో ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టుగా చెబుతున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులను ప్రవీణ్ ప్రకాష్ జారీ చేయడం విశేషం.

సీఎం జగన్ కు, ఎల్వీ సుబ్రహ్మణ్యానికి మధ్య ఏ విషయంలోనూ పెద్దగా అభిప్రాయభేదాలు వచ్చిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి చీఫ్ సెక్రటరీ పునేఠాను మార్చి ఎల్వీ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నిర్వహించే సమీక్షలకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకాలేదు. ఆ అంశం కూడా అప్పట్లో సంచలనం కలిగించింది. చంద్రబాబు సీఎం అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదేమో గానీ అత్యంత మెజారిటీతో జగన్ సీఎం అయ్యారు. చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యంను కొనసాగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను బదిలీ చేశారు. అత్యంత ప్రధాన బాధ్యతల్లో ఉండే వారి బదిలీ వ్యవహారం ఎంతో సున్నితమైంది. యావత్ రాష్ట్ర పాలనాయంత్రాంగం తీరును ప్రభావితం చేస్తుంది. రొటీన్ గా జరిగే మార్పులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు జరిగింది రొటీన్ కు భిన్నమైంది. అందుకే ఇప్పుడందరి దృష్టి కూడా ఇదే అంశంపై ఉంది. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అంత తేలిగ్గా బయటపడనప్పటికీ పాలనా వ్యవహారాలపై ఈ బదిలీ ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇలా బదిలీ చేయడం ద్వారా అధికార వర్గాలకు సీఎం జగన్ ఒక సందేశం అందించినట్లయింది. మరి అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Full View 

Tags:    

Similar News