అమరావతి... జాడ కనపడదేమి.. ఏపీకి రాజధాని ఉన్నట్టా... లేనట్టా?

Update: 2019-11-06 10:16 GMT

తెలంగాణ రాజధాని హైదరాబాద్. తమిళనాడుకు చెన్నై.. మహారాష్ట్రకు ముంబై.... కర్నాటకకు బెంగళూరు, మరి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉన్నట్టా... లేనట్టా? ఉంటే ఎక్కడ ఉంది.? అదేంటి అమరావతి ఉంది కదా అంటారా? నిజమే కావచ్చు కానీ ఇది మనకు మనం అనుకునే రాజధాని మాత్రమే. అధికారంగా మాత్రం కాదు. ఎందుకంటే తాజా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చోటు దక్కలేదు. అవును మీరు విన్నది నిజమే.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నోటిఫై చేయలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల రాజధాని నగరాలను గుర్తించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాజధాని నగరాన్ని గుర్తించకుండా మ్యాప్‌లు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికి లేకపోవడం అవమానకరమే. దీనికి కారణం మీరంటే మీరన్న నిందలు కామనే. మీ వల్లే మ్యాప్‌లో గ్యాప్‌ వచ్చిందని తిట్ల పురాణాలు మాములే. గడిచిన ఐదేళ్ల నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో అ.. అంటే అమరావతి అన్నట్టుగా చెప్పుకొచ్చినా దేశ చిత్రపటంలో పేరు లేకపోవడం విచిత్రంగా ఉందని జగన్‌ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. కేంద్రానికి చంద్రబాబు గెజిట్‌ నోటీస్‌ ఇచ్చారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు వ్యక్తిగత పోకడలు, దోపిడీలతోనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని బొత్స అన్నారు.

అసలేం జరిగింది? ఎందుకిలా జరిగింది? మ్యాప్‌లో అమరావతికి చోటు ఎందుకు దక్కలేదు? ఇక్కడ కాస్త వివరంగ మాట్లాడుకోవాలి. కేంద్రం ఇటీవలే జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ, కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. శ్రీనగర్ రాజధానిగా జమ్మూకశ్మీర్, లేహ్ రాజధానిగా లడఖ్‌‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూ కశ్మీర్‌కి ఉన్న రాష్ట్ర హోదా రద్దవడంతో భారత్‌లో రాష్ట్రాల సంఖ్య 28కి చేరింది. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య రెండు నుంచి 9కి చేరింది. జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత భారత్‌లోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం కొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. ఇప్పుడదే వివాదానికి కారణమవుతోంది. మ్యాప్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలను, ఆయా రాష్ట్రాల రాజధానులను గుర్తించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని చూపేలా ఎలాంటి సూచికలు లేవు. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను మ్యాప్‌లో చూపించినా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు.

తాజాగా వైరల్‌ అవుతున్న భారతదేశ చిత్రపటం నిజమైనదేనా ఎవరు దీన్ని విడుదల చేశారు? కేంద్ర హోంశాఖ రిలీజ్‌ చేస్తేనే కానీ దానికి ప్రామాణికం ఉండదు హోంశాఖ ఆ మేరకు ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు నిజమైన చిత్రపటం ఇదెలా అవుతుందన్నది భౌగోళిక శాస్త్రవేత్తల అభిప్రాయం.

అమరావతి పేరు మ్యాప్‌లో లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలనే కాదు యావత్‌ తెలుగు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అమరావతికి భౌగోళిక గుర్తింపు లేకపోవడంతో రాజధానిగా గుర్తించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఐదేళ్లు కావొస్తున్నా నేటికీ గుర్తింపునకు నోచుకోకపోవడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. సచివాలయం, హైకోర్టు వంటి నిర్మాణాలు చేపట్టినా అవి గ్రామాల్లో ఏర్పాటైనట్లుగా భావించాల్సి వస్తోందిప్పుడు. సచివాలయం, హైకోర్టు చిరునామా ఆయా గ్రామాల పిన్‌కోడ్‌తోనే కొనసాగుతుండమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అమరావతి పేరు మ్యాప్‌లో లేకపోవడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో నేను మీతో చెబుతాను.

ఒకటి... అమరావతి రాజధాని అయిన ఐదేళ్లలో ఏ భవనం అధికారికంగా లేకపోవడం.

రెండు... ఉన్న భవనాలన్నీ తాత్కాలిక నిర్మాణాలు కావటం.

మూడు.... రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పకపోవటం.

నాలుగు... నిధుల వినియోగ ధృవపత్రం కేంద్రానికి సమర్పించకపోవటం.

ఐదు... రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని పదేళ్ల పాటు హైదరాబాద్ కొనసాగాలని నిర్ణయించటం.

ఆరు... రాష్ట్రం నుంచి సర్వే ఆఫ్ ఇండియాకు అధికారిక సమాచారం ఉండకపోవటం.

కేంద్రం విడుదల చేసిన ఇండియా కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే కారణమన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను ఐదేళ్ల పాటు రాజధాని పేరుతో మోసం చేశారని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశపటంలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించకపోవడంపై ఆ రాష్ట్ర యువత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిందని మండిపడ్డారు.

ఏమైనా ఇది కచ్చితంగా సమాచారలోపమే అన్నది ఒక వాదన అయితే సరైన సమాచారం లేకపోవడం వల్ల కేంద్రం అమరావతి పేరు చేర్చలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ కొంచం డిటైల్డ్‌గా మాట్లాడుకుందాం. చంద్రబాబు హయాంలో 2015 అక్టోబరు 23న ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతి మీదిగానే జరిగింది. రాజధాని నగర నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను సమీకరించారు. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, హైకోర్టు భవనం రెండూ తాత్కాలికమేనని కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇక్కడే కేంద్రానికి స్పష్టత లేకుండాపోయింది. సచివాలయం, హైకోర్టు ఉన్నది వెలగపూడి కావడంతో రాష్ట్ర రాజధాని వెలగపూడా అమరావతా? ఏదనే విషయంపై అయోమయానికి గురై ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. దీని ప్రకారమే ఏపీకి రాజధాని పేరు చేర్చలేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ అదే అయితే తెలంగాణకు హైదరాబాద్‌ అని ఎలా రాశారో అదే మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కూడా హైదరాబాద్‌ అని రాసి ఉండాలని కదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాలన వ్యవస్థకు సంబంధించి అన్ని కార్యాలయాలు అమరావతికి తరలిపోయినా ఏపీ కేంద్రంగానే పాలన వ్యవస్థ కొనసాగుతున్నా రాజధాని భాగ్యం ఆంధ్రప్రదేశ్‌కు మ్యాప్‌లో లేకుండాపోవడమే విచారకరం.  

Full View

Tags:    

Similar News