Gannavaram: వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికి ఇస్తారు?
Gannavaram: కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్న యార్లగడ్డ
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు రంజుగా మారాయి. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి పరాజయం పాలైన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం టిక్కెట్టును ఆశిస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వల్లభనేని వంశీ తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. టీడీపీ తరఫున గెలిచినప్పటికీ.. రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గన్నవరం రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు అధిష్టానం పెద్దగా జోక్యం చేసుకోకపోవడంతో ఇపుడు తాడోపేడో తేల్చేకోడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు సిద్ధమయ్యారు.
ఎల్లుండి గన్నవరంలో పార్టీ నాయకులు, తన అనుచరవర్గంతో ప్రత్యేక సమావేశం కానున్నారు. పార్టీలో కొనసాగాలా? వేరే పార్టీ మారాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గన్నవరం పంచాయితీ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం చేరినట్లు సమాచారం.