ఏపీలో కొత్త సీఎస్‌ ఎవరనే దానిపై చర్చ.. అంతా ఓకే అయితే కొత్త సీఎస్‌గా..

Update: 2020-12-11 06:25 GMT

ఏపీ సీఎస్‌ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర కొత్త సిఎస్ ఎవరు..? ముఖ్యమంత్రి ఎవరికి ఈ పదవి కట్టబెట్టనున్నారనే అంశాలు చర్చనీయంగా మారాయి. సీనియార్టీ ప్రకారం పలువురు అధికారులున్నా ప్రధానంగా ఇద్దరు మాత్రం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది సస్పెన్స్‌గా మారింది.

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవికాలం ఈ నెలఖరుకు ముగియునుంది. దీంతో కొత్త సిఎస్ ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీనియార్టీ ఆధారంగా కొత్త సీఎస్ ఎంపిక జరగాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా ఆదిత్య నాథ్ దాస్‌ పేరు వినిపిస్తోంది.

ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని తరువాత సీనియారిటీ ప్రకారం చూస్తే అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఏస్వీ ప్రసాద్, నీరబ్ కూమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుభ్రమణ్యం కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఇక చంద్రబాబు హయాంలో సిఎస్ గా పని చేసిన సతీష్ చంద్రను మళ్లీ నియమించేందుకు సీఎం జగన్‌ సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. మరో అధికారి నీరభ్ కూమార్ సర్వీస్‌ 2024 వరకు ఉండటంతో అప్పటివరకు సీఎస్‌గా ఉంచలేమని సీఎం భావిస్తున్నారని సమాచారం. దీంతో గతంలో జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఆదిత్యనాథ్ దాస్‌ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే సీఎం జగన్‌ ప్రస్తుతం ఆయనను ఎంపిక చేసేందుకే మొగ్గు చూపుతుండటంతో ఆదిత్యనాథ్‌ దాస్‌ కొత్త సీఎస్‌గా ఖరారవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

Full View


Tags:    

Similar News