Polavaram Project Controversy: పోలవరంపై అసలు గేమ్‌ ఎవరిది?

Update: 2020-11-05 05:51 GMT

Polavaram Project Controversy : ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటోన్న తరుణంలో, ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయమేఘాలు అలుముకుంటున్నాయి. తాజా అంచనాలకు కేంద్రం కొర్రీ పెట్టిన నేపథ్యంలో, ఈ వర్రీ అంతా మీ వల్లేనంటూ వైసీపీ, టిడిపిలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అయితే ఈ రచ్చ అంతటికీ కేంద్రబిందువైన కేంద్రాన్ని మాత్రం ఆ రెండు పార్టీలు ప్రశ్నించేందుకు పెదవి విప్పటం లేదు. కలబడతామని కదం తొక్కడం లేదు మరి టిడిపి, వైసీపీలు కమలంపై కామ్‌గా ఉన్నారెందుకు...?

ఏపీకి అత్యంత కీలకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు డ్రోన్ కెమెరా తిరిగినట్లు తిరుగుతున్నాయి. దశాబ్ధాల నాటి కల అయిన పోలవరం ప్రాజెక్టును, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదిగో చేస్తున్నాం అదిగో వచ్చేస్తోంది అంటూ హామీల వర్షం కురిపించేసి, ఆపై చేతులెత్తేస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1941లో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదన పురుడుపోసుకుంది. ఆ తర్వాత 1976లో కొద్ది మార్పులతో కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అనంతరం 1981లో నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మళ్లీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిన పోలవరం, మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, తెరపైకి వచ్చింది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కదలికలు రాగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో మళ్లీ బ్రేక్ పడింది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత, మళ్లీ పోలవరం ప్రాజెక్టుపై అందరి దృష్టీ పడింది. విభజన చట్టంలో సైతం ఈ ప్రాజెక్టును చేర్చి, నిర్మాణ బాధ్యత అంతా కేంద్రానిదేనని స్పష్టంగా చెప్పారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వమైనా పోలవరానికి మా సహకారం ఉంటుందని కుండబద్ధలు కొట్టారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. విభజన చేసిన కాంగ్రెస్, ఆ తర్వాత ఎన్నికల్లో అధికారం కోల్పోగా, అధికారంలోకి వచ్చిన బీజేపీ సహకారం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. తాజా 55 వేల కోట్ల అంచనాలను కాదని పాత అంచనా అయిన 20,398 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడంతో, కొత్తగా ఏర్పడిన ఈ కొర్రీ ఎప్పటికి తేలుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది.

దీంతో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. మా హయాంలో పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తయింది. మిగిలిన 30 శాతం పూర్తి చేయటం లో వైసీపీ ఫెయిలైంది. 22 మంది ఎంపిలు ఉండి ఏం చేస్తున్నారు...? కేంద్రంతో ఎందుకు ఫైట్ చేయరంటూ వైసీపీపై దాడి మొదలెట్టింది టిడిపి. అయితే మీరు చేసినదానివల్లే ఇదంతా జరుగుతోంది. మీరు గతంలో కేంద్రం పోలవరంపై అంచనాలను ఆమోదించటం వల్లే, ప్రస్తుతం ప్రాజెక్టు భవిష్యత్తుపై పడిందని ఎదురుదాడికి దిగుతోంది వైసీపీ. అంతా మీరే చేశారంటూ టిడిపిపై విరుచుకుపడే ప్రయత్నం చేసింది. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. జాతీయప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత మీదే, మీరే దీన్ని పూర్తిచేయండంటూ లేఖలో విన్నవించుకున్నారు.

కానీ ఇంత సీరియస్ ఇష్యూలో కూడా జరుగుతోన్న కామెడీ ఏంటంటే అటు టిడిపి కానీ, ఇటు వైసీపీ కానీ బీజేపీని నిలదీసే ప్రయత్నం చేయకపోవటమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో ఏపార్టీ ఉన్నా, జాతీయప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యాల్సిందేననీ, విభజన సమయంలో, తాను కూడా ఓ చేయి వేసిన బీజేపీ, ఇప్పుడు రాష్ట్ర జీవనాడిగా ఉన్న పోలవరానికి నిధుల వరాన్ని ప్రకటించకపోవటం శాపంగా మారుతుందన్న విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. మరి ఎన్నికల హామీల్లో ఊదరగొట్టి, ఆ తర్వాత హామీలతో అదరగొట్టిన టిడిపి, వైసీపీలు బీజేపీ వైపు వేలెత్తి చూపరేమని ప్రశ్నిస్తే ఆకాశం వంక అదోలా చూస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. రాష్ర రైతాంగానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టు విషయంలో, నిలదీస్తే నిధులొస్తాయి కదా అన్న భావన అధికార వైసీపీలో కనబడకపోగా వాళ్లూ వాళ్లూ కొట్టుకుంటారు మధ్యలో మనకెందుకని టిడిపి మౌనంగా పొలిటికల్ షో చూస్తోంది. మీరెందుకు చేయరు...? అప్పుడు హామీ ఇచ్చారు కదా మీరు చేయాల్సిందే, ఆ బాధ్యత మీదేనని గట్టిగా ప్రశ్నించేందుకు కూడా టిడిపి గొంతు విప్పటం లేదు. ఎందుకంటే ఈ విషయంలో ఆ పార్టీ లెక్కలు ఆ పార్టీకున్నాయి కాబట్టి.

మొత్తంగా పోలవరం చుట్టూ రేగుతున్న, ఈ పొలిటికల్ హీట్ లో, రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ చలికాచుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నాయి. కేంద్రంతో సంబంధాలను వైసీపీ, టిడిపిలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోరుకుంటున్న నేపథ్యంలో, బీజేపీపై కత్తి దూసేందుకే కాదు, కన్నెత్తి చూసేందుకు కూడా ఆ రెండు పార్టీలు ఇష్టపడటం లేనట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ రాజకీయ చిత్తడిలో మాపై ఒత్తిడిలేదుగా అన్నట్లు, బీజేపీ కూడా సైలెంటుగానే చూస్తోంది. అయితే అడగనిదే అమ్మయినా పెట్టదన్నట్లు పోలవరంపై రాష్ట్రంలో రాజకీయపార్టీలన్నీ గట్టిగా అడగకపోతే పెద్దన్న లాంటి కేంద్రం, ఈ నాన్చుడు ధోరణే కొనసాగించే ప్రమాదం ఉందన్నది రాజకీయ పరిశీలకుల మాట. మరి ఇప్పటికైనా సదరు పార్టీలన్నీ పోలవరాన్ని రాష్ట్రానికి వరంగా మార్చేలా వ్యవహరిస్తాయా..? లేక వారి తీరుతో శాపంగా మారుస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Full View


Tags:    

Similar News