గంటా స్కెచ్ అదేనా.. మరి గంటా వ్యూహం ఫలిస్తుందా?

Ganta Srinivasa Rao: గతంలో ఉత్తరాంద్రలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు సరైన వేదిక కోసం వెతుకుతున్నారు.

Update: 2022-01-08 08:34 GMT

గంటా స్కెచ్ అదేనా.. మరి గంటా వ్యూహం ఫలిస్తుందా?

Ganta Srinivasa Rao: గతంలో ఉత్తరాంద్రలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు సరైన వేదిక కోసం వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే కాపులను సమాయత్తం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాపుల ఐక్యత కోసం కృషి అనేది గంటా తన ఉనికి కోసం చేస్తున్నారా? లేక తన సామాజికవర్గం కోసం చేస్తున్నారా అన్న ప్రశ్నలు అందరి మదినీ తొలుస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు గురించి ఉత్తరాంధ్రలో తెలియనివారుండరు. మూడేళ్ళ క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేత. గత ఎన్నికల్లో విశాఖ నగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేశారు. లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదని విమర్శలు రావడంతో మరలా స్పీకర్ ఫార్మాట్‌లో గంటా తన రాజీనామా లేఖను పంపారు. కొంత కాలంగా రాజకీయ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు ఇటీవల ఒక్కసారిగా ప్రజలు మధ్య కనిపిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇంతటితో ఆగకుండా ఇకపై రాష్ట్ర రాజకీయాలను శాసించేది కాపు సామాజికవర్గమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు గంటా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారాయి.

కాపులు ఏకం అవుతున్నారనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఇటీవల విశాఖ జిల్లాలో దివంగత వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా గంటాతో పాటు కాపు నాయకులు వైసిపి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తోట త్రీమూర్తులు తదితర నేతలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా భవిష్యత్తులో రాష్ట రాజకీయాలు శాసించేది కాపులేనన్న గంటా సామాజికవర్గ ప్రజలంతా ఏకం కావాలని సూచించారు. తోట త్రీమూర్తులు, ధర్మశ్రీ కూడా ఇదే తరహాలో ప్రసంగాలు చేశారు. తోట త్రిమూర్తులు కూడా గంటా మాదిరిగా భవిష్యత్తు అంతా కాపులదేనని యువత రంగాని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ భవిష్యత్తులో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కడి నుండి పోటీ చేసినా వారిని గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చారు. మొత్తానికి పార్టీలకు అతీతంగా కాపు నేతలంతా తమదే భవిష్యత్తు అనే నినాదాన్ని తీసుకోవడం అందరిని ఆలోచింపచేస్తోంది.

తాను ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీ అధికారం కోల్పోవడంతో దాదాపు మూడేళ్ళ నుంచి గంటా శ్రీనివాసరావు ప్రజలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో గంటా పార్టీ మారుతున్నారంటూ వివిధ పార్టీల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇంతవరకు ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానంటూ చెబుతున్న గంటా ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలు సాగిస్తున్నరనే ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగం కొనసాగింది. ఈ సందర్భంగానే పార్టీలకు అతీతంగా అనేక మంది కాపు నేతలు గంటాను ఆయన నివాసంలో కలిసారు. మరి గంటా వ్యూహం ఫలిస్తుందా? రానున్న ఎన్నికల్లో కాపు సామాజికవర్గం తరపు నుంచి ఆయన చక్రం తిప్పుతారా అంటూ చర్చించుకుంటున్నారు.

ఇంతకీ ఏపీలో కాపుల్ని ఏకం చేయడానికి గంటా శ్రీనివాసరావు చేస్తున్న ప్రయత్నాలు సామాజిక వర్గ ప్రయోజనాల కోసమా? లేక తన ఉనికిని కాపాడుకోవడం కోసమా? అనేది తెలియడానికి కొంతకాలం పడుతుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News