రఘురామ రాజు కోరుకుంటున్న దొకటి. వైసీపీ అధిష్టానం చెయ్యాలనుకుంటున్నది మరోటి. కానీ రాజుకు కావాల్సింది వైసీపీ ఇవ్వదు, వైసీపీ చెయ్యాలనుకుంటున్నది రాజు జరగనివ్వరు. అందుకే ఇద్దరి మధ్యా కిష్కింధకాండ ఎపిసోడ్, రోజుకొకటి బయటికొస్తోంది. ఇప్పుడు హస్తినలో వాలిపోయిన రఘురామ, క్లైమాక్స్ ఎపిసోడ్‌కు స్క్రీన్ సిద్దం చేశారు. అయితే, అసలు ట్విస్టు తమ దగ్గరే వుందంటోంది వైసీపీ. అసలు వారాక్కావాల్సింది ఏంటి? ఒకరిపై మరొకరు సంధించడానికి సిద్దంగా చేసుకున్న ఆయుధాలేంటి?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు కొరకురాని కొయ్యగా మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. పార్టీతో సై అంటే సై అంటూ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో, రాజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత, మీడియాతో ఇప్పుడు మాట్లాడలేనంటూ చేతులు ఊపుతూ వెళ్లిపోయారు రఘరామ. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎందుకు కలవాల్సి వచ్చింది అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. రఘురామకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ ఇచ్చింది. అందుకు ఆయన తనదైన శైలిలో జవాబు కూడా ఇచ్చారు. అందులో పొందుపరిచిన అనేక ప్రశ్నలు, ఎన్నిక సంఘంతో ముడిపడిన అంశాలే. వాటి గురించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాజు కలుసుంటారని తెలుస్తోంది. తనకందిన షోకాజ్ నోటీసు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పేరుతో వుంది, అయితే, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచానని, తన రిప్లైలోనే చెప్పారు రాజు. కాబట్టి తనకు పంపిన షోకాజ్‌కే చట్టబద్దత లేదంటున్నారు. అది చెల్లుబాటు కాదంటున్నారు. ఈ అంశాన్నీ ఈసీ దగ్గర ప్రస్తావించారని తెలుస్తోంది. అలాగే అసలు వైసీపీలో క్రమశిక్షణా సంఘం వుందా దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసిందా అని కూడా లా పాయింట్ లాగారు. ఇవన్నీ ఈసీ దగ్గర ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
అసలు రఘురామకు కావాల్సింది ఏంటి? సస్పెన్షన్ కోసమే ఇంత రగడనా? రాజుగారిని వెనకుండి నడిపిస్తున్న న్యాయ కోవిదుడు ఎవరు? రఘురామకృష్ణంరాజు చాలా తెలివిగా తనపై విసిన బంతిని, వైసీపీ చేత్తోనో మళ్లీ వాళ్ల కోర్టులోకే వేశారు. అయితే రఘురామ కృష్ణంరాజు పక్కా వ్యూహంతోనే ఇలా వ్యవహరించారనే అభిప్రాయాలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఒక రహస్య ఎజెండాతో రఘరామకృష్ణం రాజు ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే రియాక్ట్ అవుతున్నారని, దాన్నిఅర్ధం చేసుకోవడంలో వైసీపీ విఫలమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ పంపించిన షోకాజ్ నోటీస్‌లో న్యాయపరమైన అంశాలు లేవనెత్తి ఇప్పుడు పార్టీ మూలాలు, ఉనికిపైనే దెబ్బ కొట్టేంత పని చేయడానికి రఘురామ సాహసిస్తున్నారంటే, మోటివ్ చాలా గట్టిగానే వుందని కొందరు విశ్లేషిస్తున్నారు. రఘురామ రాజు ఇప్పటికిప్పుడు పార్టీకి లేదా పదవి రాజీనామా చేయదలచుకోలేదు. ఒకసారి పదవికి రాజీనామా చేస్తే తన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఎంపీ పదవి కోసం ఎంతగానో తపించిన రఘురామ, పొరపాటున కూడా దాన్ని వదులుకోడు. దాంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తే, తనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే తనకు తానుగా పార్టీ నుంచి గాని, పదవి నుంచి గానీ వెళ్లకుండా, పార్టీ అధినేత ద్వారానే సస్పెండ్ చేయించుకుంటే తనకు కలిసి వస్తుందని రఘురామ కృష్ణంరాజు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు స్వతంత్ర ఎంపీగా కంటిన్యూ కావచ్చు. బయటి నుంచి ఏ పార్టీకైనా మద్దతివ్వొచ్చు. ఇదే వ్యూహంతోనే రఘరామ కృష్ణంరాజు ఇలా క్లిష్టమైన న్యాయపరమైన అంశాలను లేవనెత్తారని అర్థమవుతోంది. అందులో భాగంగానే తనపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే విధంగా పార్టీ పెద్దలను రెచ్చగొడుతున్నారు. రఘురామ ఇన్ని లా పాయింట్లు అన్వేషించడం వెనక, ఒక ప్రముఖ న్యాయవాది ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన డైరక్షన్‌లోనే రాజు చెలరేగిపోతున్నారని చర్చ సాగుతోంది.
రఘురామకు కావాల్సింది సస్పెన్షన్...ఇది క్లియర్. వైసీపీ అధిష్టానం డిస్‌క్వాలిఫై అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటోంది. మరి సస్పెన్షన్ వర్సెస్ డిస్‌క్వాలిఫైలో నెగ్గే ఆయుధమేది? ఇదే ఇప్పడు ట్వంటీ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రాజుగారు రాజీనామా చేస్తే, డిస్‌క్వాలిఫై అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటోంది వైసీపీ. గెలిచిన పార్టీపైనే తిరుగుబాటు చేసి, ధిక్కారం చేసి, క్రమశిక్షణ తప్పాడని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే లోక్‌సభలో ఏదైనా బిల్లు ఓటింగ్‌లో విప్‌ను ధిక్కరిస్తే, ఆ రూట్‌లోనూ వెళ్లాలనుకుంటోంది. అయితే, రాజుపై అనర్హత వేటు వెయ్యాలంటే, అంత ఈజీకాదు. ఎందుకంటే, బీజేపీతో రాజు బంధం పెనవేసుకుంది. లోక్‌సభ స్పీకర్‌తోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఏపీలో రాజును లీడర్‌గా ఎస్టాబ్లిష్ చేసేందుకు, వైసీపీ మీద రాజును ప్రయోగించడానికి ఇలాంటి పరిణామాలు ఉపయోగపడతాయని బీజేపీ భావించవచ్చు కూడా. అలాగని తనకు పరోక్షంగా అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఎంతగానో మద్దతిస్తున్న వైసీపీని కేవలం ఒక ఎంపీ కారణంగా దూరం చేసుకోవడం కూడా బీజేపీకి సందిగ్దమే. మొత్తానికి సస్పెన్షన్ వేటుతో ఫ్రీబర్డ్‌గా ఎగిరిపోవాలని రఘురామ అనేక లూప్ పాయింట్లు లాగుతుంటే, అనర్హత వేటుతో రెక్కలు విరిచేయాలని భావిస్తోంది వైసీపీ. మరి ఈ సమరంలో నెగ్గేదెవరో కాలమే సమాధానం చెప్పాలి.