టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీగా వైసీపీ తరపున నామినేషన్ వేశారు. పార్టీలో కీలక నాయకులంతా తోడురాగా, పత్రాలు సమర్పించారు. అదేంటి జగన్ మండలిని రద్దు చెయ్యాలనుకుంటున్నారు కదా మరి డొక్కాతో నామినేషన్ వేయించడం ఎందుకు? అందరికీ ఇదే డౌటనుమానం. మరి డొక్కా నామినేషన్ వెనక కథేంటి? మండలిపై సీఎం జగన్ వ్యూహం మారిందా? మరింత పదునెక్కిందా?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వంటకం ఎప్పటికప్పుడు మసాలా దినుసులను దట్టిస్తూ ఘాటెక్కిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మండలిలో ప్రస్తుతానికి టీడీపీకి బలముండటంతో, మూడు రాజధానుల బిల్లును ఆపగలిగింది ప్రతిపక్షం. దీంతో చిర్రెత్తుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఏకంగా మండలిని రద్దు చెయ్యాలని డిసైడ్ చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపింది. ప్రస్తుతం కేంద్రం దగ్గర ఆ బిల్లు పెండింగ్‌లో వుంది. అయితే, ఇప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్, మండలి ఎపిసోడ్‌కే కొత్త ట్విస్ట్ యాడ్ చేసింది.
తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా వున్న డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుుకున్నారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే పదవి వస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఆయన నామినేషన్ వేశారు. పార్టీలో కీలక నాయకులంతా ఆయన వెంట వచ్చి, నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇంత వరకూ బాగానే వుంది. మరి మండలిని రద్దు చెయ్యాలనుకుంటున్న జగన్, డొక్కాతో ఎందుకు నామినేషన్ వేయించారన్నది, ఎవ్వరికీ బోధపడ్డం లేదు. దీని వెనక రెండు రకాల కథనాలు వినిపిస్తున్నాయి.
మొదట మండలి రద్దుపై జగన్ పునరాలోచనలో పడ్డారా అన్న పాయింట్ వెనక వినిపిస్తున్న కథనాలు పరిశీలిద్దాం. మండలిని రద్దు చెయ్యాలంటూ వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపింది. మొన్నటి బడ్జెట్ సెషన్‌లో ఆ బిల్లును అసలు టచ్ చెయ్యలేదు కేంద్రం. కరోనా నేపథ్యంలో అసలు ఎప్పుడు బిల్లును సభలో ప్రవేశపెడుతుందో తెలియదు. కనీసం ఏడాది కావచ్చు, లేదంటే రెండేళ్లు కావచ్చు. అసలు వైసీపీని సతాయించడానికి రద్దుకు ఆమోదముద్ర వెయ్యకపోవచ్చు కూడా. మరికొన్ని నెలల్లోనే మండలిలో వైసీపీ బలం పెరుగుతుంది. అటువంటప్పుడు ఎందుకు రద్దు చెయ్యాలన్నది సీనియర్లు కొందరు జగన్ దగ్గర వినిపిస్తున్న మాట. రానున్న రెండు నెలల్లో ఆరు స్థానాలు సొంతం కాబోతున్నాయి. ఇలా ఒక్కో స్థానం వైసీపీలో ఖాతాలో పడుతుండటం, పదవులు రాక నిరాశలో వున్న సీనియర్లు, జూనియర్లకు కట్టబెట్టి అసంతృప్తి తగ్గించడం, వంటి పాజిటివ్ పరిణామాలు సైతం జరుగుతాయి. మండలిలో టీడీపీ బలం తగ్గి, మెజారిటీ వస్తే, బిల్లులకు అడ్డంకి వుండదు. ఇలా దీర్ఘకాలంలో కౌన్సిల్‌లో వైసీపీకే ఎక్కువ స్కోపుంది. అటువంటప్పుడు, షార్ట్ టైం హ్యాపీ కోసం, లాంగ్‌టర్మ్ గెయిన్స్ ఎందుకు వదులుకోవాలని కొందరు సీనియర్లు, జగన్ దగ్గర ప్రస్తావిస్తున్నారట. దీంతో మండలి రద్దుపై జగన్ పునరాలోచనలో పడ్డట్టు, కొందరు సీనియర్ మంత్రులు సైతం బయటకు చెప్పకపోయినా, ఆఫ్ ది రికార్డ్ సంభాషణల్లో చెబుతున్నారట. డొక్కాతో నామినేషనే అందుకు నిదర్శనమనే వారూ వున్నారు. ఇది ఒక యాంగిల్.
అయితే, ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని వెనక్కి తీసుకోవడం జగన్ నైజం కాదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతిపక్షాలు, కోర్టులు వారిస్తున్నా, కొన్ని నిర్ణయాల్లో జగన్ మొండిగా ముందుకే వెళుతున్నారు తప్ప, వెనక్కి మళ్లడం లేదు. మాట తప్పను, మడమ తప్పను అనే జగన్, మండలి విషయంలో పునరాలోచించే అవకాశమే లేదని మరికొందరు వైసీపీ సీనియర్లు ఘంటాపథంగా చెబుతున్నారు. అసెంబ్లీలో వాడివేడిగా వాదించి, మండలి రద్దు తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపడం వంటి, పతాక శీర్షికలెక్కిన పరిణామాలు జరిగిన తర్వాత, జగన్ మండలి రద్దుపై యూటర్న్ తీసుకునే చాన్సే లేదనేవారున్నారు. మరి ఇప్పుడెందుకు డొక్కాతో పాటు మరికొందరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తున్నారన్న వాదనకు కూడా, వారి దగ్గర సమాధానముంది.
మండలి రద్దు బిల్లు పార్లమెంట్‌లో ఎప్పుడు పాస్ అవుతుందో తెలీదు. అటువంటప్పుడు, ఖాళీ అవుతున్న సీట్లను వదిలేసుకోవడం ఎందుకన్నది వారి వాదన. బిల్లు పాస్ అయ్యేంత వరకు, మండలిలో బలం పెంచుకుంటూనే వుంటామని అంటున్నారు. డొక్కా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్నినాని, అంబటి రాంబాబు సైతం ఇదే చెప్పారు. మండలి రద్దుపై వెనక్కి తగ్గేదిలేదంటున్నారు.
మొత్తానికి వైసీపీ తరపున ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ వెయ్యడంతో, మండలి రద్దుపై ఇలాంటి రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. రద్దుపై జగన్ పునరాలోచనలో పడ్డారని కొందరు, లేదు మాటంటే మాటే మండలి రద్దు ఖాయమంటూ మరికొందరంటున్నారు. రానున్న కాలమే దీనికి సమాధానంచెప్పాలి.