కాకినాడ డీఆర్సీ వేదికగా వైసీపీలో భగ్గుమన్న విభేదాలు దేనికి సంకేతం? టిడ్కో ఇళ్లపై సుభాష్ బోస్ ఆరోపణల వెనక అసలు కథేంటి? ద్వారంపూడి-పిల్లి సుభాష్ మాటల యుద్ధంలో, వినిపించని, కనిపించని మాటలేంటి? ఉన్నట్టుండి రాజ్యసభ ఎంపీ, ఈ రేంజ్‌లో చెలరేగిపోవడం వెనక బలమైన కారణం ఏదైనా వుందా?
తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. DRC సమావేశం వేదికగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం వాడివేడిగా జరిగింది. టిడ్కో ఇళ్ళ కేటాయింపుల్లో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. దీనిపై ద్వారంపూడి అభ్యంతరం తెలపడంతో, ఇద్దరు నేతల నడుమ సంవాదం సాగింది. ఎలా వసూలు చేశారు? ఎవరు చేశారో చెప్పాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ మెడలైన్ వంతెన గురించి ప్రస్తావించారు. ఈ వంతెన నిర్మాణం విషయంలో అభ్యంతరం తెలిపారు సుభాష్. కాకినాడ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా మునిగిపోయే మెడలైన్ వంతెన నిర్మాణాన్ని ఆపేయాలని సూచించారు. అయితే, దీనిపై కూడా ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేతలు వెనక్కి తగ్గకుండా వాదులాడుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అర్థంతరంగా డీఆర్సీ సమావేశాన్ని వాయిదా వేశారు. మొత్తానికి డీఆర్సీ మీటింగ్‌లో సుభాష్ బోస్, ద్వారంపూడి ఆర్గ్యూమెంట్, పార్టీ అధిష్టానం దృష్టికి సైతం వెళ్లింది. సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధమేంటని ఆరా తీశారట.
ఎప్పుడూలేనిది, పిల్లి సుభాష్ చంద్రబోస్, సొంత పార్టీ నేతలపైనే రుసరుసలాడటం ఏంటన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే, దీని వెనక చాలా కథ వుందన్న మాటలూ వినపడుతున్నాయి. కాకినాడలో ద్వారంపూడి పెత్తనం పెరిగిపోతోందన్నది బోస్‌తో పాటు చాలామంది వైసీపీ నేతల ఆరోపణ అట. పేరుకే ఉన్నత పదవుల్లో వున్నా, ద్వారంపూడి కనసన్నల్లోనే వ్యవహారమంతా సాగుతోందని, లోలోపల రగిలిపోతున్నారట తూర్పు వైసీపీ లీడర్లు. ద్వారంపూడి మీద పీకలదాకా కోపమున్నా ఎవ్వరూ బయటపడలేదని, పిల్లి సుభాష్ మాత్రమే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అంటున్నారట నేతలు.
మొత్తానికి రగులుతున్న అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలవ్వాల్సిందే. ఇప్పుడు కాకినాడ డీఆర్సీ మీటింగ్‌లో అదే జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి డామినేషన్‌పై ఉడుకుతున్న నేతలు ఒక్కొక్కరిగా, ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. వారిలో పిల్లి సుభాష్ ఒకరట. మున్ముందు ద్వారంపూడిపై నిరసనల స్వరాలు పెరిగే చాన్సుందన్న చర్చ జరుగుతోంది. అయితే, నేతల మధ‌్య విభేదాలు అంతిమంగా పార్టీకి నష్టం తెస్తాయని, అధిష్టానం సైతం కోప్పడుతోందట. ఏదైనా వుంటే, ఇంటర్నల్ మీటింగ్స్‌లోనే మాట్లాడుకుని, పరిష్కరించుకోవాలని చెబుతున్నారట. చూడాలి, తూర్పు రాజకీయంలో ఇంకెన్ని సెగలో.