హథిరాంజీ మఠంలో ఎన్నో చిక్కుముళ్లు.. అంతుచిక్కని రహస్యాలకు మఠం కేరాఫ్‌

Update: 2020-03-13 08:53 GMT

అది పరమ పవిత్రమైన మఠం. ఆ మఠంలోని మహంతులు దేవుడితో సమానం. సాదువులు, సన్యాసులు అక్కడ నివాసం ఉంటారు. అద్భుతాలకు, రహస్యాలకు నిలయం. శతాబ్ధాల చరిత్రకలిగిన ఆ మఠంలో వేలకోట్ల ఆస్తులు, వెలకట్టలేని ఆభరణాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అద్భుతాలకు, ప్రాచీన కళాఖండాలకు, పురాతన వస్తువులకు దర్శనం. అబ్బుర పరచే భూగర్భ రహస్యగది అందులో నుంచి ఓ సొరంగ మార్గం కనిపించడం సంచలనంగా మారింది. ఆ మఠం వెనుక ఉన్న మర్మం ఏంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే

హథిరాంజీ మఠం ఎన్నో చిక్కుముళ్లతో పాటు అంతుచిక్కని రహస్యాలకు కేరాఫ్‌. మఠం భూములు కళ్లముందే కర్పూరంలా కరిగిపోతున్న ఇప్పటికి తరగని సంపద సొంతం. కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరునికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములతోపాటు వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారట. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలతో పాటు అత్యంత విలువైన వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు ఉన్నాయి. వీటిలో అత్యంత విలువైన పచ్చతోపాటు ప్రత్యేకమైన బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది.

పేరుకు మఠమే అయినా వేల కోట్ల రూపాయల సంపదకు కేరాఫ్‌. వందల కోట్ల రూపాయ ఆస్తులు పరాధీనమైనా ఇప్పటికి తరగని సంపద ఈ మఠం సొంతం. ఒక్క ఎకరం కోట్ల రూపాయలు పలుకుంతుంది. ఇంచుమించు రెండు వేల ఎకరాలు భూములు ఇప్పటికి మఠం ఆధీనంలోనే ఉన్నాయి. తిరుపతి చుట్టుపక్కలే కాదు ఎక్కడెక్కడో ఈ మఠానికి ఆస్తులు ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన హథీరాంజీ మఠం ఆస్తులు తిరుపతిలోనే కాక ముంబై, మహారాష్ట్ర, ఢీల్లీ తదితర ప్రదేశాల్లో ఉన్నాయి. చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి,

ఐదారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హథీరామ్ జీ మఠంపై వస్తున్న వార్తలు దిమ్మతిరిగేలా ఉన్నాయి. మఠం కష్టోడియన్ అర్జున్ దాస్‌ను తొలగించిన తర్వాత అనేక విషయాలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ప్రాచీన కళాఖండాలు, అబ్బురపరిచే భూగర్భ రహస్య గది అందులో నుంచి ఓ సొరంగ మార్గం కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇది మఠం సొత్తును దాచడానికి నిర్మించిన నేలమాళిగా లేక తిరుమల కొండపైకి సొరంగ మార్గమా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 19వ శతాబ్దానికి చెందిన పులి చర్మంతో పాటు అడవి జంతువుల కొమ్ముల వరకు ఎన్నో అరుదైన వస్తువులకు వేదికగా నిలిచింది మఠం.

హథీరాంజీ మఠం అధిపతి అర్జున్‌దాస్‌పై ప్రభుత్వం ఎందుకు వేటు వేసింది? మఠానికి సంబంధించిన వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుంది? అందరూ అనుమానిస్తున్నట్టు ఆ మఠంలో నేలమాళిగలు ఉన్నాయా? అర్జున్‌దాస్‌ కంటే ముందే మఠంలో అక్రమాలు జరిగాయా వివాదాలకు కేంద్ర బిందువుగా మఠం ఎందుకు మారింది.

హంథీరాంజీ మఠంకు సుమారు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి కొందరు భక్త బృందంతో పాటు హథీరాం బావాజీ తిరుమలకు వచ్చారట. శ్రీ వేంక‌టేశ్వరుని దివ్య మంగ‌ళ విగ్రహాన్ని చూసిన ఆయ‌న మ‌న‌సు అక్కడే ల‌గ్నమైపోయిందట. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయ‌న తిరుమ‌ల‌లోనే ఉండి నిత్యం వేంక‌టేశ్వరుని ద‌ర్శించుకునేవారట. చెప్పాలంటే ప‌వ‌ళింపు సేవ ముగిసిన త‌రువాత‌ స్వయంగా శ్రీనివాసుడే బావాజీ దగ్గరకు వచ్చి పాచిక‌లూ ఆడుకునేవారట. కాలక్రమేణ తిరుమల శ్రీవారి ఆలయం నిర్వాహణ బాధ్యత హథీరాంజీ మఠం చేతికి వచ్చింది. సుమారు 90 ఏళ్ల పాటు శ్రీవారి ఆలయ వ్యవహారాలను మఠానికి చెందిన మహంతులే చూసుకునేవారట. అలా మఠానికి వందల కోట్ల విలువ చేసే ఖరీదైన వేల ఎకరాలు ఆస్తులు ఉన్నాయి. దేశమంతా అనేక నగరాల్లో మఠానికి భూములు ఉన్నాయి. మఠం ఆస్తులపై కస్టోడియన్‌కు సర్వాధికారులు ఉండేవి.

1975లో హథీరాంజీ మఠానికి దేవేంద్రదాస్‌ మహంతుగా నియమితులయ్యారు. స్థిర చరాస్తులకు సంబంధించిన రిజిస్టర్‌లో మఠానికి చెందిన ఏయే నగలు ఉన్నాయి, వాటి బరువెంత తదితర వివరాలను చూసుకునేవారు. ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన పలువురు ఆస్తులు, నగల వ్యవహరంలో గోల్‌మాల్‌ చేసినట్లు తెలుస్తోంది. 2006లో మఠం మహంతుగా ఉంటున్న అర్జున్‌ దాస్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వాటిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. అంతేకాక అవినీతిపరులకు సపోర్ట్‌గా నిలుస్తున్నారన్న అనేక అవినీతి ఆరోపణలు వినిపించాయి. మఠం ద్వారా ఇచ్చిన ఆభరణాలు, కానుకల రూపంలో ఇచ్చిన వందలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులలో గోల్‌మాల్‌ జరగడంతో అర్జున్‌దాస్‌ సస్పెండ్‌ చేశారు. మఠం ప్రత్యేక అధికారి శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనంచేసుకున్నారు. మహంత్‌ అర్జున్‌దాస్‌ ఉంటున్న గదిని తెరవగా నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి.

మహంత్‌ గది రాజుగారి గదిని తలపించింది. మహంతు గదిలోనే సొరంగం మార్గం కనిపించడం సంచలనంగా మారింది. ఆ సొరంగ మార్గం బాగా చెత్త, దుమ్ము, ధూళితో నిండి పోయి కనిపించింది. పైగా ఎన్నో ఏళ్లుగా వాడుకలో లేనట్లుగా కనిపించింది. ప్రవేశద్వారానికి తాళం వేసి కనిపించింది. మఠం మట్టానికి సుమారు 10 అడుగులు కిందకు దిగితే ఈ సొరంగ మార్గం కనిపింస్తోంది. తిరుపతి మహంతు మఠం నుంచి తిరుమలకు సుమారు 25 కిమీ దూరం ఉంటుంది. ఇంత దూరం పాటు సొరంగం ఉంటుందా లేక ఇది కేవలం ఇక్కడికే పరిమితమైనదా అనేది అంతుపట్టని ప్రశ్నగా మారింది. అయితే స్వామి హధీరాం బావాజీ ఇదే మార్గం గుండా తిరుమల కొండపైకి వెళ్లినట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఏది ఏమైనా కనిపిస్తున్న ఈ రహస్య మార్గం గుండా సొరంగం ఉందా లేదా అనేది మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.


Full View

 

Tags:    

Similar News