ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది...? మూడు రాజధానుల నిర్ణయంతో ప్రభుత్వం అమరావతిలో వేస్తున్న ఒక్కో అడుగు వివాదాస్పదంగా మారుతోందా..?. ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం చేసినా హైకోర్టు స్టేటస్‌కో కారణంగా ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం అమరావతిలో పలు ప్రాంతాల్లో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాలను తొలిగించింది. ఇప్పడు ఆ గ్రామాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. వీటి తరలింపు వెనుక కారణం ఏంటి..? ఇవన్నీ కాకుండా తరలింపు ప్రక్రియ ప్రారంభమైందా..? అసలు విషయం ఏంటి..?
ఏపీ రాజధాని పరిధిలో ఉండే సీఆర్డీఏ ఏపీ రాజధాని పరిధిలో రైతుల నుండి భూ సమీకరణ వారితో ఒప్పందాలు కౌలు చెల్లింపులు అక్కడ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా సీఆర్డీఏ పర్యవేక్షణలోనే జరిగేవి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఆర్డీఏను రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ స్థానంలో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ చట్టం రద్దు కాకుండా అమరావతి జేఏసీ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించటంతో దానిపై హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విజయవాడ కేంద్రంగా సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం తుళ్లూరుతో పాటుగా మరో తొమ్మిది ప్రాంతాల్లో సీఆర్డీఏ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటికి ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించారు. రైతులు- ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీల పూర్తి సమాచారం ఆ కార్యాలయాల్లో అందుబాటులో ఉండేది. అక్కడే రైతులకు కావాల్సిన సమాచారం ఇవ్వటంతో పాటుగా ప్రభుత్వం నుండి అందే సాయం అందించేవారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇవి కొనసాగాయి. కొద్ది రోజులుగా దశల వారీగా ఈ సీఆర్డీఏ కార్యాలయాలను ప్రభుత్వం తొలిగిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది సీఆర్డీఏ యూనిట్లను ప్రభుత్వం తొలిగించింది. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటనేది మాత్రం స్పష్టత లేదు. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
సీఆర్డీఏ పరిధిలోని తొమ్మిది కార్యాలయాలను తొలిగించిన ప్రభుత్వం వాటిల్లోని రికార్డులన్నింటినీ తుళ్లూరు కార్యాలయానికి తరలించింది. అమరావతి నుండి పాలనా రాజధానిని తరలించినా అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సీఆర్డీఏ రద్దు ద్వారా న్యాయపరంగా అమలు కాకున్నా దాని పేరుతో నిర్వహణ ఖర్చు, భారం తగ్గించుకొనేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా అనేది మరో చర్చ. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ సైతం ప్రభుత్వం తొలిగించింది. దీని ద్వారా ముందు నుండి చెబుతున్న విధంగానే అమరావతిలో రాజధానిగా కల్పించిన ప్రత్యేక ఏర్పాట్లను ఒక్కొక్కటిగా తొలిగిస్తోంది.
కోర్టులో అమరావతి భూముల మొదలు రాజధాని తరలింపు వరకు అనేక అంశాలపై పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరి కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం కార్యనిర్వహణలో భాగంగా నిర్ణయాలు అమలవుతాయని వీటి వలన సాధారణ ప్రజలకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తోంది. అయితే, ప్రభుత్వం వేస్తున్న అడుగులు మాత్రం విశాఖ వైపే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయంటున్నారు కొందరు.