టీడీపీ సంక్షోభంతో కమల-సేన బలపడుతోందా..భయపడుతోందా?

Update: 2020-06-19 09:14 GMT

అరెస్టులతో తెలుగుదేశం అష్టకష్టాల్లో వుంది. పైస్థాయి లీడర్లు జైలుకు పోతుండటంతో, కిందిస్థాయి శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే, టీడీపీలో ఇలాంటి పరిస్థితి కోసమే కమలసేన వెయిట్‌ చేస్తోందా? సైకిల్‌ పార్టీ క్రైసిస్‌ తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటోందా? తోటి విపక్షాన్ని ఓదారుస్తుంది అనుకుంటే, కాషాయ నేతల మరింత మంటపెట్టే మాటలే అందుకు నిదర్శనమా? తెలుగుదేశం అరెస్టులతో కమలసేన బలపడుతోందా భయపడుతోందా?

ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం విపత్కర పరిస్థితుల్లో వుంది. అసలే అతి తక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని నిర్వేదంలో వున్న టీడీపీకి, అరెస్టుల పర్వం మరింత కుంగదీస్తోంది. టీడీపీ జమానా మొత్తం అవినీతి ఖజానా అంటూ, వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్కటీగా స్కామ్‌లు వెలుగులోకి తెస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనపడుతున్నారు. క్యాడర్‌ను కాపాడుకునేందుకు, ధైర్యం నింపేందుకు చంద్రబాబు, లోకేష్‌లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలా టీడీపీ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ, జనసేనల ఆలోచనేంటి? టీడీపీ బలహీనపడుతోందని సంబరపడుతున్నాయా? సెంటిమెంట్‌‌ రగులుతుండటంతో తెలుగుదేశం బలపడుతోందని భయపడుతున్నాయా? ఇలాంటి సందర్భంలో కమల-సేన వ్యూహమేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రధానంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్‌ వున్నాయి. బీజేపీ-జనసేనను ఒక పక్షంగా పరిగణిస్తే, మొత్తం ఐదు పక్షాలే. వీటిలో కాంగ్రెస్‌, వామపక్షాలను మినహాయిస్తే, పోటీలో వున్నవి మూడు పక్షాలే. కానీ అప్పుడు, ఇప్పుడు పోటీ మాత్రం వైసీపీ-టీడీపీ మధ్యనే నడుస్తోంది. ఎలాగైనా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటోంది బీజేపీ-జనసేన. కానీ టీడీపీ వుండగా, ఆల్టర్నేటివ్‌ సాధ్యంకాదు. అయితే, చంద్రబాబు తప్ప మరో మాస్‌ లీడర్‌ టీడీపీలో లేకపోవడం, ఆయనకూ వయసు మీదపడుతుండటంతో, కమలసేన ఆశలు పెట్టుకుంది. టీడీపీని రీప్లేస్ చేసి, సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో అరెస్టులతో, ఒక సంక్షోభ వాతావరణం నెలకొనడంతో, ఇదొక మంచి అవకాశంగా భావిస్తోందట బీజేపీ కూటమి. రేసులో టీడీపీని దాటేందుకు అందివచ్చిన చాన్స్‌గా కమలసేన అనుకుంటోందట. టీడీపీ మాజీ మంత్రుల అరెస్టుపై బీజేపీ నేతల స్పందనే అందుకు నిదర్శనం.

టీడీపీలో కీలక నేతల అరెస్టులపై బీజేపీ స్ట్రయిట్‌గానే స్పందిస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను బీజేపీ స్వాగతిస్తుందని చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఎవరు తప్పుచేసినా చట్ట ప్రకారం విచారణ చేయాలని ఆయన కోరారు. అవినీతి చేయకుంటే టీడీపీ నేతలకు భయమెందుకని ప్రశ్నించారు కన్నా. టీడీపీ హయాంలో రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు.

బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు, అరెస్టుల పర్వంపై ఓ రేంజ్‌లో స్పందించారు. చంద్రబాబు పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. నిధులను స్వాహా చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. హౌసింగ్‌, నీరు-చెట్టు సహా అన్నింటిలోనూ అవినీతి జరిగిందన్న సోము వీర్రాజు అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే టీడీపీలో చాలా మంది జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు.

తెలుగుదేశంలో అరెస్టులను సమర్థిస్తోంది బీజేపీ. ఇది క్లియర్‌. ఏడాది ఆలస్యమైందని అంటోంది. తెలుగుదేశంను మరింత ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యాఖ్యానిస్తోంది. అయితే, బీజేపీ మిత్రపక్షం జనసేన మాత్రం, బీజేపీ స్పందనకు కాస్త డిఫరెంట్‌గా రియాక్ట్‌ అయ్యింది. అచ్చెన్నాయుడును అరెస్టు చేసింది అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైసిపి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించింది. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేస్తూనే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోందని అభిప్రాయపడింది. అరెస్టులపై బీజేపీ వైఖరితో పోల్చితే, టీడీపీతో పాత స్నేహాల ప్రభావంతో జనసేన సుతిమెత్తగా మాట్లాడిందన్న చర్చ జరుగుతోంది.

మొత్తానికి తెలుగుదేశంలో అరెస్టుల పర్వాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ శర్వశక్తులా ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం హయాంలో అవినీతి ఏరులై పారిందని వ్యాఖ్యానిస్తోంది. దేశంలో అవినీతి రహిత పాలన మోడి అందిస్తున్నారంటున్న బీజేపీ, టీడీపీ ఒక్కటే కాదు, వైసీపీ సైతం కరప్షన్‌కు పాల్పడుతోందని విమర్శిస్తోంది. మొన్న ఆ పార్టీ జాతీయ నేత రాంమాధవ్‌ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

టీడీపీ నేతల అరెస్టులు బీజేపీ సమర్థించడం, మరిన్ని ఆరోపణలు చెయ్యడం ద్వారా, దాని స్థానంలో తాను రావాలనుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఇదే అదనుగా టీడీపీలోంచి వలసలను ప్రోత్సహించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తోంది. బీజేపీలో వుంటే, ఇలాంటి బాధలుండవు అన్నట్టుగా సంకేతాలిస్తోంది. కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా మోడీ-షాల సమ్మతంలేనిదే, అరెస్టులకు వైసీపీ అవకాశమిచ్చేదికాదంటున్నారు. వైసీపీ, బీజేపీలు లోలోపల స్నేహంతో, టీడీపీని బలహీనం చేసే కుట్ర చేస్తున్నాయని, కొందరు తెలుగు తమ్ముళ్లు లోలోపల రగిలిపోతున్నారు.

అయితే, వరుసబెట్టి ప్రముఖ నేతల అరెస్టుతో టీడీపీలో సంక్షోభం వస్తుందని కమలసేన ఆశలు పెట్టుకుంటుంటే, సెంటిమెంట్‌తో మరింత బలపడతామంటోంది తెలుగుదేశం. జగన్‌ అరెస్టుతో వైసీపీ ఎలా శక్తివంతం అయ్యిందో, అదే తరహా జనంలో టీడీపీ పట్ల సానుభూతి పెరుగుతుందని అంచనా వేస్తోంది. నిరసనలు, ఆందోళనలు, అరెస్టయిన నేతలు, వారి కార్యకర్తల పరామర్శలతో, క్యాడర్‌లో కసి నింపుతామంటోంది. బలహీనం కాదు, బలపడతామంటోంది టీడీపీ. ఇదే యాంగిల్‌లో బీజేపీకి కాస్త కంగారు కూడా పెట్టుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య గొడవతో ఆ రెండు పార్టీలే మరింత పోటాపోటీగా వున్నాయని లెక్కలేస్తోంది. అయితే, కాంగ్రెస్‌ను వైసీపీ రీప్లేస్ చేసినట్టు, కచ్చితంగా ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతామన్న భరోసాతో వుంది కమలసేన. టీడీపీలో అరెస్టుపర్వంతో కమలసేన బలపడుతుందో....భయపడుతుందో, కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News