Araku Coffee: అరకులోయ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు

అరకు కాఫీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇక్కడ సాగుచేసేది అరబికా రకం. ఈ కాఫీని ఎవరైనా ఒకసారి తాగితే ఎప్పుడూ మరిచిపోరు.

Update: 2024-07-03 05:34 GMT

అరకులోయ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు

Araku Coffee: అరకు కాఫీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీలో తయారయ్యే ఈ కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ కాఫీ రుచి గురించి ప్రస్తావించారు.

అరకులో కాఫీ తోటల కథ

అరకులో కాఫీ తోటలకు బ్రిటీష్ వాళ్లకు సంబంధం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న ఆంగ్లేయులు కాఫీ సాగును ప్రారంభించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న గిరిజనులు ఈ పంటనే తమ జీవనాధారం చేసుకున్నారు.

1898 లో పాములేరు లోయలో కాఫీ పంటను ఆంగ్లేయులు సాగు చేశారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలోని అరకు, అనంతగిరి, జీకేవీధి, చింతపల్లి, పెదబయల, ఆర్వీనగర్, మినుములూరు ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేశారు.

బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడ కాఫీ పంట సాగు మాత్రం ఆగలేదు.1960లో విశాఖ రిజర్వ్ అటవీ ప్రాంతంలో 10 వేల ఎకరాల్లో కాఫీ పంట సాగు చేశారు. అప్పటి నుండి గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైంది.

అరకు కాఫీ టేస్ట్ చరిత్ర..


అరకు కాఫీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇక్కడ సాగుచేసేది అరబికా రకం. ఈ కాఫీని ఎవరైనా ఒకసారి తాగితే ఎప్పుడూ మరిచిపోరు. అరబికా రకం కాఫీ తోటలకు స్థానిక ఉన్న వాతావరణ పరిస్థితులు తోడు కావడంతో ఈ కాఫీకి అంత మంచి రుచి వచ్చిందని చెబుతుంటారు.

సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో కాఫీ తోటలుంటాయి.సిల్వర్ ఓక్, మిరియాల చెట్ల మధ్య కాఫీ తోటలు పెరుగుతాయి. దీంతో సూర్యకిరణాలు నేరుగా కాఫీ తోటలను తాకవు. చల్లని వాతావరణంతో పాటు ఈ నేలలో క్షార గుణం తక్కువగా ఉండడం కూడా అరకు కాఫీ రుచిగా ఉండేందుకు కారణమని జీసీసీ ఎండీ సురేష్ కుమార్ చెప్పారు.

అరకు కాఫీకి దక్కిన జీఐ గుర్తింపు


విశాఖపట్టణం ఏజెన్సీలోని పండించే అరబికా రకం కాఫీకి 2019లో భౌగోళిక గుర్తింపు దక్కింది. దేశంలోని ఐదు రకాల కాఫీలకు జీఐలో చోటు దక్కితే అందులో అరకు కాఫీ కూడా ఒకటి. అరకు తో పాటు కర్ణాటక చిక్క మంగుళూరు, బాబుదాన్ గిరిస్, కూర్గ్ లలో లభ్యమయ్యే అరబికా వెరైట కాఫీకి కూడ జీఐ దక్కింది. కేరళలోని వాయనాడ్ రోబస్టా కూడా జీఐ దక్కించుకుంది.

విదేశాల్లో అరకు కాఫీ బ్రాండ్ షాపులు


అరకు కాఫీ బ్రాండ్ ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రసిద్ది చెందింది. దీంతో 2017లో తొలిసారిగా పారిస్ లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో కాఫీ షాప్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దక్షిణ కొరియా, జపాన్, స్విట్జర్లాండ్ లలో కూడా ఈ కాఫీ షాపులు వెలిశాయి. 2018లో అరకు కాఫీ బ్రాండ్ కు గోల్డ్ మెడల్ దక్కింది.

అరకు కాఫీకి సేంద్రీయ ఎరువుల వాడకం

అరకు కాఫీకి గిరిజన రైతులు సేంద్రీయ ఎరువులు ఉపయోగిస్తారు. కాఫీ తోటల పెంపకం సమయంలో రాలిపోయిన ఆకులను ఎరువుగా ఉపయోగిస్తారు. ఇతర ప్రాంతాల్లో కాఫీ పంటలు రసాయన మందులు వినియోగిస్తారు. కానీ, అరకులో మాత్రం సేంద్రీయ ఎరువులనే వాడుతారు. అరకు అరబికా బ్రాండ్ కాఫీ రుచిగా ఉండడానికి సేంద్రీయ ఎరువులు కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అరకు కాఫీ తో రెట్టింపైన జీసీసీ టర్నోవర్


అరకు కాఫీ కారణంగా జీసీసీ టర్నోవర్ 2023-24 లో రూ.2,303 కోట్లకు చేరింది. 2019 నాటికి ఈ టర్నోవర్ రూ. 1209 కోట్లు ఉండేది. సేంద్రీయ ధృవీకరణకు సంబంధించి ఐదు అవార్డులు స్వంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ప్రతి ఏటా 71,258 మెట్రిక్ టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. గిరిజనులు పండించిన కాఫీ పంటకు జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు.

అరకు కాఫీ అంతర్జాతీయంగా పేరొందడం వెనుక స్థానిక గిరిజన రైతుల పాత్ర కీలకం. ఎర్రగా చెర్రీ పండుగా మారిన తర్వాతే కాఫీ గింజలను ప్రాసెసింగ్ కోసం మొక్కల నుండి కోస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన మిషన్ల ద్వారా కాఫీ పొడిని తయారు చేస్తారు. ప్రాసెసింగ్ సమయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు.

Tags:    

Similar News