పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న చలి

* చలితో ఇబ్బందులు పడుతున్న పిల్లలు, వృద్ధులు.. చలితో ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ

Update: 2022-12-23 02:45 GMT

పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న చలి 

Andhra Pradesh: పశ్చిమగోదావరిపై చలి పంజా విసురుతోంది. చలి తీవ్రతతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటివరకు తుపాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గినట్టు అనిపించినా మళ్ళీ అమాంతం పెరిగిపోయింది. రాత్రి వేళల్లో 17 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ఉష్ణోగ్రత పడిపోతుంది. చలితో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగిపోవడంతో జనం రహదారుపై ప్రయాణాలు తగ్గించుకున్నారు. చలితీవ్రతను తట్టుకునేందుకు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండం, తుపానులు ఎక్కువగా రావటంతో చలితీవ్రత కొంత మేరకు తగ్గింది. ఇప్పుడు సాధారణ వాతావరణం ఏర్పడటంతో చలి గణనీయంగా పెరిగింది. దాదాపు వారం రోజుల పాటు చలితీవ్రత ఎక్కువుగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం రాత్రి వేళల్లో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.

చలి తీవ్రత పెరుగుతుండటంతో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోను మరిన్ని ఉన్ని దుస్తుల దుకాణాలు వెలిశాయి. నేపాల్‌కి చెందిన వారు ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు వేసి ఉన్ని దుస్తుల అమ్ముతున్నారు. తెల్లవారుజామున మంచు ఎక్కువుగా ఉండటం వల్ల రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాకింగ్‌ చేసే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. చలిలో ఎక్కువగా తిరిగితే జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చలిలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్న సమయంలో వేడి పదార్దాలు తీసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News