Weather Updates in AP: వర్షాల జోరు.. రైతులకు ప్రయోజనం
Weather Updates in AP: నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడైతే ఇంకేముంది.
Weather Updates in AP: నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడైతే ఇంకేముంది. వర్షాలు తీవ్రస్థాయిలో కురుస్తున్నాయి. అయితే వీటి ప్రభావం కొన్ని జిల్లాల్లో మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లగా చిరు జల్లులతో సరిపెడుతుంది. అయితే రానున్న రెండు, మూడు రోజుల్లో ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే వీటి స్థితి ఎలా ఉన్నా ఈ చినుకులు రైతులకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయని చెప్పాలి.
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. వీటివల్ల ఖరీఫ్ వరికి సంబంధించి రైతులు ఇప్పటికే నారు మడులు వేసుకునేందుకు అవకాశం వచ్చింది. అధిక శాతం మంది రైతులు పొలాలు దుక్కి చేసుకుని విత్తనాలను వేసుకుంటున్నారు. దీనివల్ల సకాలంలో ఖరీఫ్ సీజను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
► కృష్ణా జిల్లా లింగగూడెం వద్ద గండి వాగు పొంగటంతో పెనుగంచిప్రోలు–విజయవాడ మధ్య.. మరోవైపు ముండ్లపాడు మీదుగా నందిగామ, విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. జి.కొండూరు మండలంలో పులివాగుపై కల్వర్టు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి చేలు ముంపు బారినపడ్డాయి. విశాఖ, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
మరో మూడు రోజులు వర్షాలు
► వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది.
► ఈ నెల 18న కోస్తాంధ్ర, 19న ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.