Weather Updates: నేటి నుంచి మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
Weather Updates: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పాటు కొనసాగుతోంది. వారం రోజులు క్రితం ఏర్పడ్డ అల్ప పీడన ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి.
Weather Updates: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పాటు కొనసాగుతోంది. వారం రోజులు క్రితం ఏర్పడ్డ అల్ప పీడన ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. దీంతో పాటు తాజాగా మరో కొత్త అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలించడంతో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే వీటి ప్రభావం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ ముందుగానే పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు వీటి ప్రభావం మెట్ట పంటలపై పడి, ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొం ది. ముఖ్యంగా 9, 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా, శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాగా, శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలను దాటుకుని జూరాలకు చేరుకున్న కృష్ణమ్మ.. శనివారం అక్కడి నుంచి శ్రీశైలం వైపునకు పరుగులు తీస్తోంది. శనివారం సాయంత్రానికి 2,25, 650 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.