Weather Updates: మరో అల్పపీడనం..ఏపీలో రెండురోజులు భారీ వర్షాలు!
Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో మరో రెండు రోజుల పాటు ఏపీ లో భారీ వర్షాలు కురవ వచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Updates: ఇప్పటికే వర్షాలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు మరో చేదు వార్త చెప్పారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే..దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీనికితోడు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు పశ్చిమ ద్రోణి ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో రెండురోజులపాటు కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
సముద్రం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 5 సెం.మీ., కూనవరం, నర్సీపట్నం, బెస్తవానిపేట, చోడవరం, కుంభం, కొమరాడల్లో 3 సెం.మీ. వంతున, సత్యవేడు, సీతానగరం, సూళ్లూరుపేట, ఇచ్ఛాపురం, వరరామచంద్రాపురం, సాలూరు, యర్రగొండపాలెం, చింతపల్లిల్లో 2 సెం.మీ. వంతున వర్షపాతం నమోదైంది.