Weather Updates: వరుస అల్పపీడనాలతో ఉక్కిరి బిక్కిరి.. 20న మరొకటి రడీ

Weather Updates: దాదాపుగా రెండు నెలల నుంచి వరుస అల్పపీడనాలతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు.

Update: 2020-09-18 01:00 GMT

Weather Updates: దాదాపుగా రెండు నెలల నుంచి వరుస అల్పపీడనాలతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు. వీటి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటి ప్రభావం వల్ల ప్రధాన నదుల్లోకి వరద ప్రవాహం పెరిగి, పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు చాలావరకు మునిగిపోయాయి. ఇది పూర్తికాక ముందే మరొకటి.. అది పూర్తికాక ముందే వేరొకటి.. ఇలా రెండు నెలల నుంచి వస్తున్న వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటలు సైతం నీట మునిగాయి. ఇలా గ్రామాలను ముంచి, పంటలను నీట ముంచినా, వీటికి విశ్రాంతి లేనట్టు కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో వేరొక అల్పపీడనం రానన్నట్టు వాతావరణ శాఖ సమాచారం అందించింది. ఇలా మరో అల్పపీడనం వస్తుందని తెలియడంతో ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

50 సిగ్నల్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం హైదరాబాద్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో నగరంలో సుమారు 50 సిగ్నల్స్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటితో పలు బస్తీలవాసులు నానా అవస్థలు పడ్డారు.


Tags:    

Similar News