Weather Updates: రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడ్డ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు.
ఆంధ్రా, ఒడిసా మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీని ప్రభావంతో ఒడిసా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు ఒంపు తిరిగింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు నుంచి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరంలో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
కురుపాంలో 100, మడకశిరలో 80, కల్లూరు 70, గార్లదిన్నె 66, మందస 43, రంపచోడవరం 35, గోపాలపురంలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. అలాగే 8, 9 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడంతో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం మినహా మిగిలిన 12 జిల్లాల్లో సాధారణం కంటే 32.5ు అధిక వర్షం కురిసింది. జూన్ 1 నుంచి జూలై 5 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 112.5 మిల్లీమీటర్లు కాగా, 149.5 మిల్లీమీటర్లు నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు పుంజుకుంది. ఇప్పటి వరకు 5 లక్షల హెక్టార్లలో పైర్లు వేశారు.