తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. పశ్చిమ ప్రాంతాల నుంచి వస్తున్న గాలుల కారణంగా ఈ ద్రోణి ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాలపై మబ్బులు ముసుగేశాయి. ఇక బంగాళాఖాతం పై తూర్పు గాలుల కారణంగా మరో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాబోయే రెండు రోజులల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు చెబుతున్నారు. తమిళనాడు తీరం నుంచి ఓడిశా తీరం వరకూ వ్యాపించి ఉన్న ఈ ద్రోణి కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక శనివారం ఆకాశం పూర్తి మేఘావృతమై ఉండగా, కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే 4 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. పగటి పూట కంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. దీంతో చలికి జనం వణుకుతున్నారు. కాగా, శనివారం హైదరాబాద్ లో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం కొనగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.