చుట్టూ గల గల పారే సెలయేళ్ళు.. కొండకోనల నుంచి జాలువారుతూ...పరవళ్ళు తొక్కే జలపాతాలు... హొయలు హొయలు గా పరుగులు తీసే వాగువంకల గలగలలు... చుట్టూరా పచ్చదనం పరచినట్లు చూపు మర్చలేనట్లుగా విస్తరించిన అడవి అందచందాలు...మనస్సును రంజింపజేసే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇదేదో కవితకోసం వర్ణన అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పచ్చదనంతో పులకించిపోతున్న అడవి అందచందాలు ఇవీ చూడడానికి రెండు కళ్ళు చాలవన్నంతగా ఉన్న ఈ ప్రకృతి బంధాలు ఎక్కడ మనసు పులకించి పోతున్న ఆ సుందర మనోహర దృశ్యాలు కనులారా చూడాల్సిందే అలాగయితే మనం నెల్లూరు జిల్లాలోని పశ్చిమ కొండల దిగువున ఉన్న కొండ కోనల వద్దకు వెళ్లాల్సిందే.
ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కుతున్న ఎన్నో జలపాతాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఉదయగిరికి 30 కిలోమీటర్ల దూరంలో గల లింగాల దొన క్షేత్రం వద్ద గల జలపాతం వరద నీటితో పరవళ్లుతొక్కుతుంది. చూపరులను ఆకట్టుకుంటుంది. లింగాల దొన క్షేత్రంవద్ద గల జలపాతం నీటితో కళకళలాడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లు కుటుంబసమేతంగా తరలివస్తున్నారు. అందమైన జలపాతంతో పాటు ఆకట్టుకునే ప్రకృతి రమణీయ దృశ్యాలు చూసి మైమరిచిపోతున్నారు. జలపాతం నుంచి జాలువారుతున్న నీటిలో కొందరు దిగితే, మరికొందరు ఈత కొడుతూ ఆనందిస్తున్నారు. చిన్నారులు హుషారుగా కేరింతలు వేస్తున్నారు. జలపాతం వద్ద గల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
మర్రిపాడు మండలం బాట సింగనపల్లి గ్రామ సమీపంలో కోతులు గుంట జలపాతం ఉంది. ఎత్తయిన కొండల నుంచి నీళ్లు జాలువారుతున్నాయి. ఇది నయాగరా జలపిస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాలవారితో పాటు కడప, ప్రకాశం జిల్లాల నుంచి జనం తరలివస్తున్నారు. కోతులు గుంట జలపాతం పై నుంచి కిందకు దూకుతున్న నీటిలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. మరికొందరు ఈత కొట్టి ఆనందిస్తుంటే, యువకులు సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు. ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలతో నెల్లూరు జిల్లాలోని భైరవ కోన, ఘాటిక సిద్ధేశ్వరం, మల్లి కొండలు జలపాతాలు నిండుకున్నాయి. 2007 తర్వాత జలపాతాలు ఇంత భారీగా పారడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. జలపాతాల అందాలు చూసి మురిసిపోతున్నారు.