విశాఖ ఉక్కు.. ఎవరి హక్కు?
* అమ్మకానికి తెలుగు జాతి ఆత్మగౌరవం * ప్రైవేట్ పరం చేస్తే స్టీల్ ధరలకు అంతు అదుపు ఉంటుందా..? * విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవ్వాల్సిందేనా..?
విశాఖపట్నం ఈ పేరు వినగానే అందమైన సాగర తీరం మన కళ్లముందు కదలాడుతోంది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ కూడా గుర్తొస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నలు దిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం గుర్తొస్తుంది. ఈ పోరులో ఏకంగా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవంగా విశాఖ ఉక్కు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్రం ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం తప్పదా? ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్తే ఉక్కు ధరలకు అడ్డు అదుపు ఉంటాయా?
విశాఖ స్టీల్ ప్లాంట‌్‌ను ప్రైవేట్ పరం చేస్తే స్టీల్ నగరం అట్టుడుకుతోందంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది భవిష్యత్ తరాల కోసం చేసిన బలిదానాలు కేంద్రం ప్రభుత్వ నిర్ణయంతో గాలిలో కలిసిపోతున్నాయి. ప్రయిడ్ ఆఫ్ ఇండియా అంటూ ఓ వెలుగు వెలిగిన ఈ భారీ పరిశ్రమ ఇక ప్రైవేట్‌పరం కానుంది. స్ట్రాటజిక్ సేల్ పేరుతో స్టీల్ ప్లాంట్ వాటాలను విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది ఈ చర్య లక్షలాది మంది జీవితాలకు శరాఘాతంగా మారుతుందనే ఆందోళన కార్మిక వర్గాల్లో మొదలైంది.
విశాఖ ఉక్కు వైభవం ఇక గత చరిత్ర కానుంది. స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ప్రైవేటీకరణ మంత్రంలో భాగంగా స్ట్రాటజికల్ సేల్ పేరుతో వాటాలను విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో 35 వేల మందికి ప్రత్యేక్షంగా లక్ష మంది పరోక్షంగానూ ఆదారఫడ్డ పరిశ్రమ భవిష్యత్తుపై కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది.
హుద్‌హుద్ తుఫాన్, కరోనా తర్వాత తీవ్ర ఆర్థిక నష్టాలను మూటగట్టుకున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. నికర లాభాలను ఆర్జించేందుకు అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ పరం చేసేందుకు సన్నద్ధం అయింది. దీంతో అందరిలోనూ నిరాశ నెలకొన్నది.
ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తోంది. ఉత్పాదక నష్టాలు లేనప్పటికీ అప్పులపై వడ్డీలు, ముడి ఇనుము కొనుగోలు వంటి కారణాలతో ఈ భారీ పరిశ్రమ గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో లాభాలను రాబట్టలేకపోయింది. దీనికి ప్రధాన కారణం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత లేకపోవడంతో ముడి సరుకులు తెచ్చుకోవడానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది. దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే.
ఇనుప ఖనిజం, థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌ల కోసం ఒడిషా మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, బిస్రా స్టోన్ లైమ్ కంపెనీల పై ఆధారపడవలసి వస్తుంది. ముడిసరుకు కొనుగోలుపై ప్రతి టన్ను స్టీల్‌పై ఐదువేల రూపాయలు కోల్పోవల్సి వస్తుంది. దాంతో సంస్థపై ఏటా మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. మార్కెట్ పరిస్థితులు ప్రభావం చూపుతున్న ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తోంది.