విశాఖలో చోటు చేసుకున్న భూముల కుంభకోణంపై దర్యాప్తు పూర్తి
* త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమైన సిట్ * సిట్ దర్యాప్తు నివేదికలో సంచలన అంశాలు బయటపడే అవకాశం * భూ కుంభకోణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిక
అందరి చూపు ఆ నివేదిక పైనే... ఇప్పటికే జాబితా కూడా సిద్ధమైంది. ఇక వెల్లడించడమే తరువాయి. అయితే ఆ నివేదికలో పలు సంచలన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇంతకి ఏమిటా జాబితా అనుకుంటున్నారా? విశాఖలో చోటు చేసుకున్న భూ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తన పని పూర్తి చేసింది. త్వరలో ప్రభుత్వానికి ఈ నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సిట్ నివేదిక కోసం నిరీక్షిస్తున్నాయి. దీంతో సిట్ నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది.
విశాఖలో ఆక్రమణ తొలగింపు పర్వం ఇప్పటికే ఉద్రిక్తతల నడుమ కొనసాగుతుంది. అయితే సిట్ నివేదిక వచ్చాక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా క్షమించేది లేదని వైసీపీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దీంతో ఆక్రమణలతో సంబంధాలు ఉన్నా రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు వచ్చాయి. దీంతో గతంలో జరిగిన అక్రమాలుపై సమగ్ర విచారణ జరిపించాలని ముగ్గురు సభ్యులుతో సీఎం జగన్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వై.వి.అనూరాధ, రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి టి.భాస్కర్‌రావులను సభ్యులుగా నియమించింది. అవసరమైతే మరొకరిని సభ్యుడిగా చేర్చుకునేందుకు సిట్‌కే అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ లో జరిగిన భూకుంభకోణాలు పై సమగ్రంగా విచారణ జరిపి మూడు నెలలో నివేధిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది
ఇప్పటికే గతలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో జరిగిన భూ అక్రమాలపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్‌ను నియమించగా ఆ కమిటీ నివేదిక సైతం ఇచ్చింది. ఇదిలా ఉంటె రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ చేస్తూ మరల సిట్ ను ఏర్పాటు చేసింది. విశాఖ లో టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు నాయకులు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో... నిజాలను వెలికితీసేందుకు జగన్ సర్కార్ సిట్‌ను రంగంలోకి దించింది. విశాఖలో విలువైన భూములు అప్పట్లో కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తి చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సిట్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. మొత్తం 350–400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు సిట్ విచారణ లో వెల్లడి అయింది.
సిట్ నివేదిక ఆధారంగా విశాఖ లో భూ కుంభకోణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రులు బొత్సా , అవంతి లు అంటున్నారు.విశాఖ లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని పబ్బం గడుపుతున్న వారు ఏ పార్టీ కి చెందినవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ నేపథ్యం లో సిట్ నివేదిక వస్తే ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ బిక్కుబిక్కుమని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సిట్ నివేదిక బయటకు వస్తే చర్యలు ఎలా ఉంటాయోనని పలువురు రాజకీయ నాయకులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. అయితే గతం లో భూ ఆక్రమణలకు పాల్పడి కొందరు నాయకులు పార్టీలను సైతం మారారు. భవిష్యత్ లో సిట్ నివేదిక వచ్చిన తరువాత వాళ్ళ పరిస్థితి ఏవిధంగా ఉంటుందని ఆసక్తికరంగా మారింది.