వెన్నెలవలసలో విచిత్రం.. ఊరు ఊరంతా లాక్‌డౌన్.. అసలు ఏం జరిగిందంటే..?
Vennelavalasa: ఊరంతా నిర్మానుష్యం. ఊళ్లో ఉన్నవాళ్లు కొందరు ఇళ్లల్లోనే ఉంటే.... మరికొన్ని ఇళ్లకు తాళాలు వేసుకున్నారు...
Vennelavalasa: ఊరంతా నిర్మానుష్యం. ఊళ్లో ఉన్నవాళ్లు కొందరు ఇళ్లల్లోనే ఉంటే.... మరికొన్ని ఇళ్లకు తాళాలు వేసుకున్నారు. ఊళ్లోకి ఎవరూ ఎంటర్ కాకుండా సరిహద్దులో ముళ్ల కంచెలు వేశారు. ప్రహారీగా పరదలు కట్టారు. ఎవరూ మా ఊరు రావద్దు.... మేమెవరమూ మీ ఊరు రామంటూ ప్రకటించారు. ఊరు ఊరంతా లాక్‌డౌన్ పెట్టారు. అయితే ఇది కరోనా లాక్‌డౌన్ అనుకుంటున్నారా ? కాదండీ.... ఊరి మంచి కోరి లాక్‌డౌన్ ప్రకటించారంటా. మరి అదేంటో మనమూ తెలుసుకుందాం పదండి...
శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామం. వారం రోజులుగా ఆ గ్రామం మొత్తం దిగ్భందనం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. మా ఊరికి మీరు రాకండి... మీ ఊరికి మేము రామంటూ ప్రకటించారు. తెలీని కొందరు వెళితే ఎవరు రమ్మన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు విషయమేంటాని ఆసక్తి గల కొందరు ఆరా తీస్తే ఊరి మంచి కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారన్నది తెలిసింది.
కొన్నిరోజులుగా గ్రామంలో కొందరు జ్వరంతో బాధపడుతున్నారు. ఒకరిద్దరు చనిపోయారు. దీంతో గ్రామంలోకి దుష్టశక్తులు వచ్చాయని నమ్మిన ఊరంతా బలంగా మూఢనమ్మకాల వైపు అడుగులు వేశారు. 20 ఏళ్లుగా తాతలు, తండ్రుల నుంచి వస్తున్న ఆచారం మొదలుపెట్టారు. ఊరి పొలిమేర పొలాల్లో నాలుగు రాళ్ళు పెట్టి దాని కింద కొబ్బరి బొండం, ప్రతీ ఇంటి నుంచి పిడికెడు బియ్యం, చింతపండు, అరటిపండు, కందిపప్పు, నల్ల జీడిపిక్కలు ఆ భూమిలో పాతి దానిమీద నిమ్మకాయ, రాయి పెట్టి 9 రోజుల పాటు ఆ కార్యం చేస్తారట.
ఇలా 20 ఏళ్లుగా వస్తున్న ఆచారం ఈనెల 17న మొదలు పెట్టగా... 25 వరకూ అమలు కానుంది.
హైటెక్ అంటూ పరుగులు పెడుతున్నా వెన్నెలవలసలో ఇప్పటికీ విచిత్ర పరిస్థితి దాపురించిందని కొందరు పెదవి విరుస్తున్నారు. ఆధునిక యుగంలో కూడా ఇటువంటివి పాటిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.