Sub Collector: రైతు వేషంలో ఎరువుల షాపుల్లో విజయవాడ సబ్‌కలెక్టర్ తనిఖీలు
* అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తింపు * కైకలూరులో రెండు షాపులు సీజ్ చేయించిన సబ్‌కలెక్టర్
Vijayawada Sub Collector: విజయవాడ సబ్ కలెక్టర్ సూర్య ప్రవీణ్ చంద్ రైతు వేషంలో కైకలూరు ఎరువుల షాపును తనిఖీ చేశారు. చిరిగిన చొక్కా, నేత లుంగీ, మెడలో టవల్ వేసుకొని అచ్చం రైతులా షాప్ కు వచ్చారు. ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు. ఎరువుల దుకాణంలో జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు ఓ యజమాని స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు. అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగితే ఎంఆర్‌పీ కంటే ఎక్కువ వసూలు చేశాడు ఆ షాప్ యజమాని. పైగా బిల్లు కూడా ఇవ్వలేదు.
ఇదంతా గమనించిన సబ్‌కలెక్టర్ సూర్యసాయి ఆ తర్వాత ఒక్కో అధికారికి ఫోన్ చేసి పిలిపించారు. ఆ రెండు షాపులను సీజ్ చేయించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు సబ్ కలెక్టర్. అయితే అక్కడ షాపు మూసివేసి ఉండటంతో రైతులను వాకబు చేశారు. ఎంఆర్‌పీ ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని రైతు తన దృష్టికి తీసుకురావడంతో యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్.