Vijayawada: విజయవాడలో కన్నీటి కాలనీలు.. నాలుగో రోజు ముంపులోనే బెజవాడ
మునిగిన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాత... బురదలో కూరుకుపోయిన తన ఆటోను చూసి కన్నీరు పెట్టిన డ్రైవరన్న.. ఇలాంటి దృష్యాలు విజయవాడలో కోకొల్లలు.
Vijayawada: ఓ మహిళ... బురదలో తమ పిల్లల దుస్తులను వెతుకుతూ....పాల కోసం ఏడుస్తున్న పసిపిల్లలు... అవ్వ, తాతలు... తమ గూడును బాగుచేసే దిక్కు లేక అల్లాడుతున్న పరిస్థితి... బుక్స్, బ్యాగ్ కన్పించక ఏడుస్తున్న విద్యార్థిని.... మునిగిన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాత... బురదలో కూరుకుపోయిన తన ఆటోను చూసి కన్నీరు పెట్టిన డ్రైవరన్న.. ఇలాంటి దృష్యాలు విజయవాడలో కోకొల్లలు.
కాలు తీసి కాలు పెట్టలేనంత బురద. రోడ్డూ, మురుగు కాలువలు కలిసిపోయి ఒండ్రు ప్రవాహం. మున్నేరుకు అరకిలోమీటరు దూరంలో ఉన్నా వరద వదల్లేదు. 30 అడుగుల మేర వరద పోటెత్తడంతో వేల సంఖ్యలో నివాసాలు మునిగిపోయాయి. ఏ ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. దాతలు అందించే ఆహారంపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు పునరావాస శిబిరాల్లో మాత్రమే ఆహారం ఇస్తుండటంతో కాలనీల్లోని తమ ఇళ్లకు చేరుకున్న కొన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. అక్కడికి శిబిరాలకు కిలోమీటర్ల దూరం ఉండటం, రోడ్లపై ఒండ్రు మేటలు ఉండటంతో వాహనాలు కదలడంలేదు. దీంతో దాతలు ఇస్తున్న పులిహోర, అన్నం, కూరలు పొట్లాలపై ఆధారపడుతున్నారు.