Vijayawada Rains : కుండపోత వర్షానికి బెజవాడ అతలాకుతలం..20ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షం
Vijayawada Rains : భారీ వర్షాల దాటికి విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. చాలా కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్డును మూసివేశారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఆదివారం సెప్టెంబర్ 1వ తేదీన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Vijayawada Rains : శనివారం విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరవాసులు ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. చాలా ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షానికి పలు కాలనీలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. సెల్లర్లలోకి వరద నీరు వచ్చింది. చాలా చోట్ల కార్లు, ఇతర వాహనాలు నీట మునిగిన పరిస్థితి నెలకొంది. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్దకొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
ఇఖ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడ వాయుగుండంగా మారి స్థింగా కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖకు ఈశాన్యంగా 80కిలోమీటర్లు కళింగపట్నానికి నైరుతిగా 40కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్ పూర్ కు నైరుతిగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక్రుతమైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం గంటకు 6కిలోమీటర్ల వేగంతో కదులుతోందని...అదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తా,రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ..కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకారం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని మత్స్య కారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.