Durga Temple: దుర్గగుడిలో నకిలీ సర్టిఫికెట్ల స్కామ్
Durga Temple: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందిన ఇద్దరు ఉద్యోగులను దుర్గగుడి ఈవో భ్రమరాంబ సస్పెండ్ చేశారు
Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వివిధర రకాల స్కాములు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో వెండి రథానికి ఉన్న మూడు వెండి సింహపు బొమ్మలు చోరీకి గురయి వార్తల్లో నిలిచింది. అంతే కాదు ఏకంగా ఈఓ పై పలు ఆరోపణలు వచ్చి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా చీరల కుంభకోణ లాంటి అనేక స్కాములు బయటకు వస్తూనే వున్నాయి. తాజాగా నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ బయటపడింది. దీంతో అప్రమత్తమైన దుర్గగుడి ఈవో భ్రమరాంబ నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఉద్యోగులపై చీటింగ్ కేసు పెట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
దుర్గగుడిలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డీవీఎస్ రాజు 2013-2015 సంవత్సరాల మధ్య బిహార్‌లోని బోధ్‌గయా మగధ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందినట్లుగా ఫేక్ సర్టిఫికెట్ల సృష్టించి పదోన్నతి కోసం దాఖలు చేశాడు. వేరే విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్.. ఇంటర్, డిగ్రీ ధ్రువీకరణ పత్రాలను రాజస్థాన్‌లోని యూనివర్సిటీ నుంచి పొంది, సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందాడు.
వీరితో పాటు మరికొందరిపై 2018లోనే విజిలెన్సు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేవస్థానంలోని 10 మంది ఉద్యోగులకు సంబంధించిన విద్యార్హతల పత్రాలను నిగ్గుతేల్చాలని దేవాదాయ శాఖకు విజిలెన్సు విభాగం అప్పట్లో నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.