మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే కల వచ్చిందని చెప్పండి: విజయసాయిరెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు.

Update: 2019-12-28 08:19 GMT
విజయ సాయిరెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు ప్రెస్ కాన్ఫరెన్సు సంతాప సమావేశంలా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంత నిప్పు, పత్తి గింజ అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు అంటే.. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశామని చెప్పండి అని సూచించారు. దీనిపై దర్యాప్తు చేసి మాపై పడిన నింద తొలగించమని సిబిఐని కోరండి.

ఏం లేకపోతే మీకెందుకు భయం అని అన్నారు. రాజధాని కోసం చంద్రబాబునాయుడు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో ఢిల్లీ మీడియా వర్గాలకు అప్పట్లో అంతుబట్టలేదు కానీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఇప్పుడర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ప్రజా ధనంతో దేశాలు తిరిగి అమరావతిపై ప్రెజెంటేషన్లిచ్చాడు. పెట్టుబడుల కోసమైతే వెనకబడిన జిల్లాల గురించి ప్రస్తావించొచ్చు కదా? అని విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్ద్యేశించి విమర్శలు సంధించారు.

కాగా ఈరోజు( 28)న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తారని.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తరువాత మొదటిసారి సీఎం.. విశాఖకు వస్తున్నారని.. ఈ సందర్బంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎం కార్యక్రమంలో పాల్గొని కనీవినీ ఎరుగని రీతిలో సీఎంకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే విశాఖలో ఒక ప్లాటు తప్ప తనకు ఎటువంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారాయన. వివాదాస్పద భూములను తానేదో సెటిల్మెంటు చేస్తున్నట్టు టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం అన్నారు.

విశాఖలో తనకు ఎక్కడ భూములు ఉన్నాయో దమ్ముంటే నిరూపించాలని టీడీపీకి సవాల్ విసిరారు విజయసాయి రెడ్డి. మరోవైపు సీఎం విశాఖ పర్యటన ఏర్పాట్లను రెండు రోజులుగా విశాఖలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు విజయసాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల తోపాటు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనలో సందర్బంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నేతలు అందరూ పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. 



Tags:    

Similar News